అంతా అయిపోయాక ముంబై చేరుకున్న రిషీ కుమార్తె
కరోనా మహమ్మారి ఎంత దారుణమైందో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే కన్నీళ్లు ఆగవు. ఓవైపు మనుషుల ప్రాణాలను హరిస్తూ.. ఆ పోయినవారి చివరిచూపుకు కూడా ఉన్నవారు నోచుకోకుండా చేస్తోంది. వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కార్మికులు ఆకలితో అల్లాడుతున్నారు. మరోవైపు కరోనా సోకినవారిని గ్రామ బహిష్కరణలు చేయిస్తోంది. ఇలా చెప్పుకుంటూపోతే కరోనా ఆడుతున్న ఆటలు కోకొల్లలు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటడు ఇఫ్రాన్ ఖాన్ తల్లి చనిపోయినప్పుడు అతను వెళ్లలేని పరిస్థితి ఉంది. లాక్‌డౌన్ కారణంగా అతను తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాడు. ఆ తర్వాత నాలుగు రోజులకే ఆయన మృతిచెందారు. ఆ ఘటన గురించి మరిచిపోకముందే బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు రిషీకపూర్ ల్యుకేమియాతో ఏప్రిల్ 30న కన్నుమూసిన విషయం తెలిసిందే.
తండ్రి కడచూపుకోసం ముంబై రావాలని తనయ రిద్దిమా కపూర్ ఎంతో ప్రయత్నించింది. ప్రభుత్వం అనుమతి తీసుకుని ఛార్టర్డ్ ఫ్లైట్‌లో రావాలని భావించినప్పటికీ, లాక్‌డౌన్‌తో అనుమతి లభించలేదు. దీంతో ఆమె దుఖ్ఖాన్ని పంటి బిగువునే అదుముకుని రోడ్డు మార్గాన ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరింది. 1400 కి.మీలు ప్రయాణించి ఆమె శనివారం రాత్రి ముంబై చేరుకుంది. తన కూతురు సమరాతో వచ్చి, తల్లిని గట్టిగా హత్తుకొని కన్నీటి పర్యంతమైంది. తండ్రిని చివరిచూపు కూడా చూసుకోలేకపోయాననే బాధతో కన్నీరుమున్నీరైంది. నాన్నతో తనుకున్న జ్ఞాపకాలను వల్లెవేసుకుని తమ్ముడు రణ్‌భీర్ కపూర్‌ని పట్టుకుని ఏడ్చింది. కాగా, అంత్యక్రియల సమయానికి చేరుకోలేనని భావించిన రిద్దిమా.. ఆలియా భట్ లైవ్ వీడియో ద్వారా వీక్షించింది. తండ్రికి లవ్ యూ అని చెప్పి తుది వీడ్కోలు పలికింది. అయితే ఆలియా చేసిన మంచి పనిని కొందరు మూర్ఖపు నెటిజన్లు ఎలా ట్రోల్ చేశారో తెలిసిందే. ఆమె ఫోన్‌లో టైంపాస్ చేస్తోందని ఆలియాను విపరీతంగా ట్రోల్ చేశారు.