రిషి సునాక్‌కు లైన్ క్లియర్.. పోటీ నుంచి తప్పుకున్న బోరిస్ - MicTv.in - Telugu News
mictv telugu

రిషి సునాక్‌కు లైన్ క్లియర్.. పోటీ నుంచి తప్పుకున్న బోరిస్

October 24, 2022

 

Rishi Sunak favourite to be UK PM after Boris Johnson drops comeback bid

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ అందరికంటే ముందున్నారు. తాజాగా, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీ నుంచి వైదొలగుతున్నట్టు ఆదివారం అర్ధరాత్రి తర్వాత ప్రకటించారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి పోటీ రేసులో తాను నిలుస్తున్నట్లు భారత సంత‌తి నేత రిషి సునక్ నిన్న అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వికి రిషి సునాక్ పోటీ చేస్తూ తుది రేసులో నిలిచినా, చివరకు లిజ్‌ ట్రస్ చేతిలో రిషి సునక్ ఓడిపోయారు.

 

అయితే బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభంతో లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో.. మరోసారి ప్రధాని ఎన్నిక షురూ అయింది. ప్రస్తుతం రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ అందరికంటే ముందున్నారు. దీంతో రిషి సునాక్‌కు దాదాపు మార్గం సుగమం అయినట్టే. ఆయన కనుక బాధ్యతలు స్వీకరిస్తే బ్రిటిష్ ప్రధాని అయిన మొదటి భారత సంతతి నేతగా నిలుస్తారు. ఆయనకు ప్రస్తుతం 144 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే అభ్యర్థిపై కన్జర్వేటివ్ పార్టీ ఏకాభిప్రాయానికి వస్తే రిషి సునక్ ను ఇవాళ సాయంత్రంలోపు తమ పార్టీ నాయకుడిగా, బ్రిటిష్ ప్రధానమంత్రిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇద్దరు అభ్యర్థులకు మించితేనే పార్టీ సభ్యులు ఓటు వేయనున్నారు.