దగ్గు, జలుబు,జ్వరం, ఫ్లూ..దేశంలో ఎక్కడా చూసినా ప్రస్తుతం ఇవే కేసులు నమోదవతున్నాయి. కోవిడ్ తరహా లక్షణాలు అధికంగా కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దగ్గు, జలుబు,జ్వరం అంటూ ఆస్పత్రి బాట పట్టారు. ఇంత పెద్ద ఎత్తును ప్రజలు ఇన్‌ఫ్లుయెంజా కేసుల బారిన పడడానికి కారణం హెచ్3ఎన్2 వైరస్ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది.
దేశంలో గత 2-3 నెలలుగా ఈ తరహా కేసులు ఎక్కువైనట్లు ఐసీఎంఆర్ తెలిపింది. హెచ్3ఎన్2 వైరస్ బారిన పడకుండా జాగ్రతలను కూడా ఇప్పటికే జారీ చేసింది. ఫేస్ మాస్క్‌లు ధరించాలి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగొద్దు. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు మీ ముక్కు, నోటిని ఏదైనా కర్చీప్ లాంటి వస్త్రంతో మూసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు పుష్కలంగా ద్రవాలు తీసువాలి.షేక్ హ్యాండ్స్ చేయకూడదు. బహిరంగంగా ఉమ్మివేయకూడదు, స్వీయ వైద్యం మంచిది కాదు” అని సూచనలు జారీ చేసింది. మరోవైపు దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌ను విచక్షణారహితంగా వాడకూడదని ఐఎంఏ హెచ్చరించింది. తాము ఇప్పటికే కొవిడ్ సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్‌మెక్టిన్‌లను విస్తృతంగా ఉపయోగించడాన్ని చూశామని తెలిపింది. యాంటీబయాటిక్స్ సూచించే ముందు ఇన్‌ఫెక్షన్ బ్యాక్టీరియా కాదా అని నిర్ధారించుకోవాలని తెలిపింది.
హెచ్3ఎన్2 వైరస్‌తో పెద్దగా ప్రమాదం లేకపోయినా దీర్ఘకాలికంగా దగ్గు, జలుబు వంటి వ్యాధులు ఉండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ వల్ల అంతగా భయపడేది లేదని, ప్రాణాపాయం కూడా లేదని నిపుణులు స్పష్టం చేశారు. కానీ కొంతమంది శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారని తెలిపారు.