శవపేటికలా కొత్త పార్లమెంట్ భవనం.. ఆర్జేడీ సంచలన ట్వీట్
కొత్త పార్లమెంట్ భవనం నమూనాను శవపేటికలా ఉందంటూ ఆర్జేడీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఓ వైపు శవపేటిక, మరో వైపు పార్లమెంట్ భవనంతో ఉన్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. కొత్త పార్లమెంటు భవనం శవపేటిక ఆకారంలో ఉందని సూచిస్తూ శవపేటిక ఫోటో పక్కన కొత్త పార్లమెంట్ భవనం ఫొటోను షేర్ చేస్తూ.. 'యే క్యా హై (ఇది ఏమిటి?)' అని ప్రశ్నించింది. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై విమర్శలతో పాటు భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ పోస్టింగ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.
ये क्या है? pic.twitter.com/9NF9iSqh4L
— Rashtriya Janata Dal (@RJDforIndia) May 28, 2023
ఆర్‌జేడీ భవిష్యత్తు శవ పేటిక అంటూ నెటిజన్లు పేర్కొన్నారు. మొదటి ఫోటో మీ పార్టీ భవిష్యత్తు , రెండో ఫోటో భారత దేశ భవిష్యత్తు అంటూ సౌరభ్ మౌర్య అనే నెటిజన్ వ్యాఖ్యానించారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం అద్బుతమని మృణాల్ మొహంతి అనే నెటిజన్ వ్యాఖ్యానించారు. ఆధునిక డిజైన్ ప్రజాస్వామ్యం కోసం ప్రగతిశీ థృక్పథాన్ని ఈ నిర్మాణం ప్రతిబింబిస్తుందన్నారు. మరోవైపు బీజేపీ కూడా ఈ పోస్టుపై ఘాటుగా స్పందించింది. ఆర్జేడీపై దేశ ద్రోహం కేసు పెట్టాలని అంటున్నారు ఆ పార్టీ నేతలు.
కాగా కొత్త పార్లమెంటును ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. రాజదండం 'సెంగోల్'ను కొత్త పార్లమెంట్ భవనానికి తీసుకెళ్లి లోక్ సభ చాంబర్ లోని స్పీకర్ కుర్చీకి కుడివైపున ఉన్న ప్రత్యేక ఎన్ క్లోజర్ లో ప్రతిష్ఠించారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ముర్ము కేవలం దేశాధినేత మాత్రమే కాదు, పార్లమెంటులో అంతర్భాగమైనందున కొత్త భవనాన్ని ప్రారంభించాలని ప్రతిపక్షాలు వాదించాయి. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై జార్ఖండ్ ఆర్జేడీ ప్రశ్నించింది. ఆర్జేడీ ప్రధాన అధికార ప్రతినిధి డాక్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతిని పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం సరికాదన్నారు.