బిహార్‌తోపాటు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ‘‘భూమి ఇస్తే ఉద్యోగం’’ కుంభకోణంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్న కేసుగా మొదట్లో భావించినా భారీ స్థాయిలోనే అక్రమాలు సాగినట్లు ఈడీ వెల్లడించింది. లాలూ ఫ్యామిలీలోని ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా పలువురు కుటుంబ సభ్యులు కళ్లు తిరిగే స్థాయిలో అక్రమాలు పాల్పడ్డారని తెలిపింది. రూ. 150 కోట్ల ఖరీదైన ఇంటిని తేజస్వి కేవలం రూ. 4 లక్షలకే కొన్నట్లు చూపారని, దీని వెనక లంచం డబ్బే కీలక పాత్ర పోషించిందని తెలిసింది. ‘‘ల్యాండ్ ఫర్ జాబ్’’ కేసులో ఈడీ తేజస్వి ఇంటితోపాటు ఆయన తండ్రి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిపైనా దాడి చేసి కీలక ఆధారాలు రాబట్టడం తెలిసిందే. వాటి ప్రకారం.. తేజస్వికి ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న నాలుగు అంతస్తుల బంగ్లా ఖరీదు రూ.150 కోట్లు. దీని కొనుగోలు విలువ రూ.4 లక్షలే. దీన్ని ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టరై ఉంది. అయితే తేజస్వీ దీన్ని తన నివాసంగా వాడుకుంటున్నాడు. కుంభకోణంతో వచ్చిన డబ్బును, అక్రమ వ్యాపారాలతో సంపాదించిన సొమ్మును దీని కొనుగోలు వెచ్చాంచాడు. రూ.600 కోట్ల విలువై జాబ్ స్కాంతో ఆర్జించిన సొమ్ములో రూ.350 కోట్ల మేరకు స్థిరాస్తులు ఉన్నరాయని, బినామీలతో రూ.250 కోట్ల లావాదేవీలు జరిపారని ఈడీ తెలిపింది. కాగా లూలూ కుటుంబ సభ్యుల ఇళ్లలో జరిపిన సోదాలలో కోటికిపైగా నగదు రెండు కేజీల బంగారం, ఆస్తుల డాక్యుమెంట్లు దొరికాయి. ల్యాండ్ ఫర్ స్కాం లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు. 2004-09 మధ్య జరిగింది. గ్రూప్ డి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు చోట్ల స్థలాలను లంచంగా పుచ్చుకున్నారు.