రహదారులపై వాహనాలతోపాటు నెత్తురు కూడా ప్రవహిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మరణమృదంగం ఆగడం లేదు. అతి వేగం.. అల్పాయుష్కులను చేస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు చనిపోయారు. వీరిలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు.మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ వినోద్, నారాయణగూడ స్టేషన్ కానిస్టేబుల్ శివకుమార్‌లు…స్నేహితులతో కలిసి కడ్తాల్ లోని మైసిగండి ఆలయానికి వెళ్లారు. వినోద్ కారు నడిపాడు. గుడి నుంచి తిరిగి వస్తుండగా దెబ్బడగూడ వద్ద నెమ్మదిగా వెళ్తోన్న ట్రాక్టర్‌ను కారు బలంగా ఢీకొట్టింది. వినోద్, ముందు సీట్లోని మరో స్నేహితుడు అక్కడికక్కడే మృతిచెందారు. శివకుమార్, మరో యువకుడు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కారును వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు.