Road Accident In Kuppam 2 Medical Students and one more person Dead
mictv telugu

తెల్లవారుజామున ఘోర ప్రమాదం.. వైద్య విద్యార్థులు మృతి

February 26, 2023

Road Accident In Kuppam 2 Medical Students and one more person Dead

పైనున్న ఫోటోలో రోడ్డు ప్రమాదానికి గురైన కారును చూశారా? ప్రమాదాలకు గురైన వాహనాలు దెబ్బతినడం చూసి ఉంటారు కానీ.. ఇలా ఆనవాళ్లు కూడా లేకుండా ఇనుప ముద్దలాగా మారిపోయిన కారును ఇదివరకు ఎక్కడా విని ఉండరు కూడా. ఎంత వేగంతో ఈ కారు ఆ లారీని ఢీ కొట్టి ఉంటుందో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రమాదం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని శెట్టిపల్లి సమీపంలో కుప్పం వైపు వెళ్తున్న కారు.. లారీని ఢీకొట్టడంతో కారు ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మెడికోలు, మరో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది.

తమ స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా పార్టీ జరుపుకుని కారులో మితిమీరిన వేగంతో వెళ్తూ అదుపుతప్పి ముందు వైపు వెళ్తున్న లారీని ఢీకొన్నారు. వేగానికి ఎదురుగా వస్తున్న మరో లారీకి కారు అడ్డంగా పడడంతో షిఫ్ట్ కారు నుజ్జునుజ్జవగా కారులోని ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మృతులు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వికాస్, కళ్యాణ్, మరో మెడికో కల్యాణ్ రామ్ సోదరుడు ప్రవీణ్ గా గుర్తించారు. ప్రమాదానికి కారు మితిమీరిన వేగమే కారణంగా తెలుస్తోంది. పీఈఎస్ నుంచి కారులో కుప్పం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీరంతా కడప, నెల్లూరుకు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్ కు చేరుకున్నారు. తెల్లవారు జామున ఘటన జరగడంతో హైవేపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.