నడి రోడ్డుపై పెద్ద గుంత.. తప్పిన ప్రమాదం  - MicTv.in - Telugu News
mictv telugu

నడి రోడ్డుపై పెద్ద గుంత.. తప్పిన ప్రమాదం 

June 5, 2020

Road Pits Down In Hyderabad

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. పెద్ద గుంత ఏర్పడటంతో వాహనదారులు హడలిపోయారు. ఉన్నట్టుండి జరిగిన ఈ ఘటనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ – ప్రశాంత్‌నగర్ ప్రధాన రోడ్డు మధ్యలో ఇది చోటు చేసుకుంది. దాదాపు 10 అడుగుల వెడల్పు, 14 అడుగుల లోతు వరకు ఇది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వెంటనే ఆ వైపు రాకపోకలు నిలిపివేసిన జీహెచ్ఎంసీ అధికారులు మరమ్మత్తులను చేపట్టారు. 

ఇటీవలే ఈ మార్గంలో రోడ్డు మరమ్మత్తులు కూడా చేశారు. అయినా కూడా ఒక్కసారిగా గుంత పడటం వెనక అధికారులు విచారణ చేపట్టారు. కొన్ని రోజుల క్రితం ఆ మార్గంలో భారీ పైపులైను నిర్మాణం జరిగిందని గుర్తించారు. దాని కారణంగానే రోడ్డు కుంగిపోయిందని చెప్పారు. ఆ ప్రాంతం అంతా పరిశీలించి మరో ప్రాంతంలో కూడా కుంగిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు.  హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో కాంట్రాక్టర్లు, అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల పెద్ద ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.