Road rage in Raipur: Minor girl stabs deaf man to death
mictv telugu

హారన్‌ కొడితే తప్పుకోలేదని.. పొడిచి చంపిన 15 ఏళ్ల పిల్ల

July 26, 2022

తెలిసీతెలియని వయసు వల్లో లేదంటే మంచిబుద్ధులు చెప్పేవాళ్లు లేకో తెలియదు కానీ కొంత మంది యువత చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. విచక్షణ కోల్పోయి పలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. 15 ఏండ్ల ఓ అమ్మాయి తాను బైక్‌పై వెళుతుండగా తనకు దారివ్వలేదన్న కారణంతో తన ముందు సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని కోపంతో పొడిచి చంపింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంకిలిపారా ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక స్కూటీపై తన తల్లిని తీసుకుని వస్తోంది. ఈ క్రమంలో ఆమె ముందు సుదామా లాడెర్ (40) అనే వ్యక్తి సైకిలుపై వెళ్తున్నాడు. వెనక వస్తున్న బాలిక సైకిల్‌ను దాటి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో పలుమార్లు హారన్ కొట్టింది. అయితే, చెవిటివాడైన సుదామాకు హారన్ శబ్దం వినిపించకపోవడంతో ఆమెకు సైడ్ ఇవ్వలేదు. హారన్ కొడుతున్నా సుదామా తప్పుకోకపోవడంతో కావాలనే అతడు తనకు దారివ్వడం లేదని భావించింది. దీంతో సైకిల్‌ను దాటి ముందుకెళ్లి స్కూటీ ఆపిన బాలిక తన వద్ద ఉన్న కత్తితో సుదామా గొంతులో పొడించింది. వెంటనే అతడు కుప్పకూలిపోయాడు. దీంతో భయపడిన బాలిక తల్లిని అక్కడే వదిలేసి పరారైంది. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.