కొండెక్కిన చికెన్, మటన్.. ఏకంగా రూ. 850 - MicTv.in - Telugu News
mictv telugu

కొండెక్కిన చికెన్, మటన్.. ఏకంగా రూ. 850

May 10, 2022

మాంసాహార ప్రియులకు గతకొన్ని నెలలుగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆదివారం రోజున చికెన్ గాని, మటన్ గాని కొందామని ఆశగా మార్కెట్‌కు వెళితే పెరిగిన చికెన్, మటన్ ధరలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. రూ. 200లోపు ఉన్న చికెన్‌కు కరోనా సమయంలో భారీ డిమాండు పెరిగింది. అప్పటి నుంచి క్రమ క్రమంగా చికెన్ ధర పెరుగుతూనే వస్తుంది. సమ్మర్‌లోనైనా చికెన్, మటన్ ధరలు తగ్గుతాయని ఆశలు పెట్టుకున్న సామాన్యులకు నిరాశలే ఎదురైతున్నాయి. మాంసం ధరలు మాత్రం తగ్గడం లేదు.

గతవారం రోజుల్లో కిలో చికెన్ ధర రూ. 50 నుంచి 60 వరకు పెరిగింది. ఈ పెరుగుదలకు ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమేనని వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో చికెన్ ధర రూ. 300కు చేరింది. ఓ వైపు ఎండలు, మరోవైపు తీవ్రమైన వేడిగాలు కొడుతున్న చికెన్ ధర మాత్రం తగ్గటం లేదు.

ఇక, మటన్ ధర విషయానికొస్తే, మటన్ ధర కూడా కొండెక్కి కూర్చొంది. పది రోజుల క్రితం కిలో మటన్ రూ. 750 వరకు ఉండేది. ప్రస్తుతం మార్కెట్లో కిలో మటన్ ధర రూ. 800 నుంచి రూ. 850 వరకు పలుకుతుంది. ఇక హైదరాబాద్‌లో అయితే, ఏరియాను బట్టి ధర ఉంటుంది. కొన్నిచోట్ల రూ. వెయ్యి వరకు పెరగడంతో మటన్ ప్రియులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో చికెన్ రూ.300, మటన్ రూ.850వరకు పెరగడంతో నాన్ వెజ్ ప్రియులు సతమతమవుతున్నారు.