దొంగోడికి దిమ్మదిరిగే షాకిచ్చిన క్యాషియర్! - MicTv.in - Telugu News
mictv telugu

దొంగోడికి దిమ్మదిరిగే షాకిచ్చిన క్యాషియర్!

December 8, 2017

కొత్త బిచ్చగాడు పొద్దెరగడని సామెత. పాపం ఆ దొంగ కూడా అంతే. అనుభవం లేని ఆ చోరుడికి ఓ క్యాషియర్ ఏమీ మాట్లాడకుండా.. అలా చూస్తూనే  పెద్ద షాకిచ్చాడు. దీంతో సదరు దొంగగారు విసుగెత్తి వెళ్లిపోయాడు.

అమెరికాలోని ఫ్లోరిడాలోని వెస్టన్ పట్టణంలో ఈ ముచ్చట సాగింది. సోమవారం రాత్రి ఓ షాపులోకి ఒక దొంగ వచ్చాడు. చాక్లెట్లు, ఐస్‌క్రీంలు తీసుకుని క్యాషియర్‌ దగ్గరకు వెళ్లాడు. క్యాషియర్‌ జేసన్ షిప్.. ఆ వస్తువులకు బిల్‌ వేస్తుండగా.. దొంగోడు జేబులోంచి పిస్టల్ బయటికి తీశాడు. బాక్సులోని నగదును బయటికి తీసి తనకివ్వాలని షిప్‌ను బెదిరించాడు. అయితే షిప్ బెదరలేదు, అదరలేదు. దొంగను అలా చూస్తూండి పోయాడు.. ఏం చేస్తావో చెయ్యి అన్నట్లు.

దీంతో దొంగకు విసుగొచ్చింది. తోకముడిచి.. షిప్ కవర్లో పెట్టి ఇచ్చిన ఇచ్చిన క్యాండీ, ఐస్ క్రీమును తీసుకుని నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ తమాషా ముచ్చట అంత సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు షిప్ ధైర్యానికి మెచ్చుకుని ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టేశారు.  అయితే అందరూ షిప్ లా ఉండొద్దని, ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో దొంగలు చెప్పినట్టు చేస్తేనే మంచిదని సెలవివ్వడం కొసమెరుపు.