దొంగల కొంప ముంచిన నిద్ర..  - MicTv.in - Telugu News
mictv telugu

దొంగల కొంప ముంచిన నిద్ర.. 

January 14, 2020

h gbvv

‘పండగ రోజులు, పైగా పంచాయితీ ఎన్నికల సీజన్ కదా.. కొందరు పోలీసులేమో పండగ హడావిడిలో మునిగి తేలుతుంటారు. మరికొందరేమో ఎన్నికల బిజీలో ఉంటారు. వాళ్లు మనల్నేం పట్టుకుంటారులే’ అని అనుకున్నారు ఇద్దరు దొంగలు. అనుకున్నదే తడవుగా దోచుకున్న సొత్తుతో రోడ్డు పక్కన తాపీగా కునుకు తీశారు. ఈలోపు పోలీసులు వచ్చి వారి పొలుసులు తీశారు. పండగైనా, ఎలక్షన్లు అయినా పోలీసోళ్లు 24 గంటలు డ్యూటీలోనే ఉంటారని నిరూపించారు. పాపం దొంగలు తమ అంచనా తప్పినందుకు కుయ్యో మొర్రో అంటున్నారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. నగర పంచాయతీలో చొరబడి వాహనం, కంప్యూటర్, ఇతర సామగ్రిని దొంగిలించారు. వాటిని తీసుకుని వెళ్తూ కంగారు ఎందుకులే అనుకున్నారు. పండగ, ఎలక్షన్ల సీజన్‌లో పోలీసులు, అధికారులు తలమునకలై ఉంటారని భావించారు. ‘అసలే రాత్రంతా నిద్ర చెడగొట్టుకుని దొంగతనం చేశాం. ఇప్పుడొచ్చిన తొందరేం లేదు. పోలీసులు వాళ్ల వాళ్ల బిజీల్లో ఉన్నారు. కాబట్టి చక్కగా విశ్రాంతి తీసుకుని వెళ్దాం’ అనుకున్నారు. కరీంనగర్ జిల్లా కురిక్యాలలో రోడ్డు పక్కన ఆగి హాయిగా నిద్రపోయారు. తెల్లవారుజామున గ్రామస్థులు వాళ్ల వద్దకు వచ్చి ఎవరు, ఎక్కన్నుంచి వచ్చారు అని అడిగారు. దీంతో వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వేములవాడకు చెందిన నాగరాజు, ఠాగూర్‌గా గుర్తించారు. వారి నుంచి దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.