కొన్ని సార్లు దొంగల తెలివితేటలు ఔరా అనిపిస్తాయి. వేసిన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి చిటికెలో కావల్సింది దోచేస్తారు. అలాంటి సమయాల్లో వారి టాలెంట్‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. తాజాగా అలాంటి దొంగతనానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చుట్టూ జనాలు, వాహనాలు, భారీ రద్దీగా ఉండే ప్రదేశంలోనే క్షణాల్లో భారీగా నగదును కొట్టేసి తమ ప్రతిభ చాటుకున్నారు ముగ్గురు దొంగలు. అయితే దొంగతనం దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ బైకర్ ఆగాడు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఏదో రోడ్డు మీద నడుస్తున్నట్టు నటించి బైక్ చుట్టూ చేరారు. అనంతరం బ్యాగులోని చేయిపెట్టి డబ్బును తీసేశారు. వెంటనే అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ఇంత జరుగుతున్నా బైకర్ దొంగతనం చేస్తున్న విషయాన్ని గమనించలేకపోయాడు. చివరికి కాసేపటి తర్వాత బ్యాగులో రూ.40 లక్షలు మాయమైనట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.38 లక్షలు స్వాహా చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు.
బాధితుడు అనీష్ ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను మహదేవ్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి రూ. 40 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బును తిరిగి నార్త్ ఎవెన్యూలోని ఒకరికి ఇవ్వడానికి వెళ్తుండగా ఈ చోరీ జరిగింది. దొంగలు చాలాసేపటి నుంచి అతడిని ఫాలో అవుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.