తెలివితక్కువ దొంగలు..సీసీటీవీ బదులు సెటప్ బాక్స్ ఎత్తుకెళ్లారు - MicTv.in - Telugu News
mictv telugu

తెలివితక్కువ దొంగలు..సీసీటీవీ బదులు సెటప్ బాక్స్ ఎత్తుకెళ్లారు

November 11, 2019

సీసీటీవీలు దొంగలను పని చేసుకోనివ్వడం లేదు. ప్రతి ఒక్కరు రక్షణ కోసం దుకాణాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో దొంగతనానికి వెళ్లిన దొంగలు చోరీ కంటే ముందు సీసీటీవీ కెమెరా ఎక్కడ ఉందో వెతుకుతున్నారు. దాని పని చూసాక వారి పని చేసుకుంటున్నారు. ఇటీవల దొంగతనానికి వచ్చిన దొంగలు సీసీటీవీ అనుకుని సెటప్ బాక్స్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఢిల్లీలోని బేగంపూర్‌లో చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం నలుగురు దొంగలు ఓ జ్యులరీ షాప్‌లోకి చొరబడ్డారు.

Robbers.

ముందుగా ఇద్దరు దొంగలు వినియోగదారుల్లాగా షాపులో అడుగుపెట్టారు. ఆ తర్వాత మరో ఇద్దరు షాపులోకి ప్రవేశించి తుపాకీతో అక్కడున్న జనాలను బెదిరించారు. షాపులో నగలు, నగదు ఉన్నదంతా దోచుకుందామనుకున్నారు. కానీ, షాపు యజమాని నగదు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో ఓ దొంగ తుపాకీతో అతడ్ని కొట్టి రూ.25 లక్షల విలువైన ఆభరణాలు, రూ.1 లక్ష నగదు దోచుకున్నారు. వాళ్ళ చోరీ సీసీటీవీలో రికార్డవుతుందని భావించిన దొంగల ముఠాలోని ఓ దొంగ సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌ను కూడా ఎత్తుకుపోదాం అనుకున్నాడు. షాపు అంతా తిరిగి అతనికి కనిపించిన ఓ ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని తన బ్యాగులో వేసుకున్నాడు. అయితే అతను ఊహించినట్టుగా అది సీసీ కెమెరా హార్డ్ డిస్క్ కాదు, సెటప్‌ బాక్స్‌. దొంగలు వెళ్లిపోయిన తరువాత యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీసీటీవీ హార్డ్ డిస్క్ బదులుగా సెటప్‌ బాక్స్‌ ఎత్తుకెళ్లిన దొంగలు పోలీసులకు పెద్దగా శ్రమ కల్పించలేదు. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.