ఓవైపు ఎందరో పేద విద్యార్థుల ఫీజులు చెల్లించి వారి భవిష్యత్తుకు పునాధులు వేశాడు. మరోవైపు 15 ఏళ్లుగా వేల కోట్ల రూపాయలు పన్నులు కట్టుకుండా ఎగ్గొట్టాడు. ఓవైపు మానవతావాదం.. మరోవైపు మోసం. ఇప్పుడు చెప్పండి అతను మంచివాడా? మోసగాడా? ఎంత స్వచ్ఛమైన పాలు అయినా అందులో చుక్క విషం కలిస్తే విరిగిపోవాల్సిందే. ఆయన పరిస్థితీ అలాగే తయారైంది ఇప్పుడు. ఆయన ఎవరో కాదు రాబర్ట్ స్మిత్. ఈ పేరు చాలా మందికి తెలిసే వుంటుంది. ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ విస్తా ఈక్విటీ పార్ట్నర్ను స్థాపించి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఎదిగడమే కాకుండా ఎంతోమందికి తనవంతుగా సాయపడ్డారు. గతేడాది మోర్ హౌస్ కాలేజీలో ఉన్న గ్రాడ్యుయేట్ విద్యార్థుల అందరి ఫీజులు చెల్లించి మానవత్వాన్ని చాటుకున్నారు.
మరోపక్క స్మిత్ 15 ఏళ్లుగా వేలకోట్ల రూపాయల పన్ను ఎగ్గొటారని శాన్ఫ్రాన్సిస్కో ఆటర్నీ డేవిడ్ ఆండర్సన్ వెల్లడించారు. అమెరికాలోనే అత్యంత ట్యాక్స్ కుంభకోణం రెండు బిలియన్ డాలర్ల కేసులో నేరస్తుడిగా ఉన్న రాబర్ట్ బ్రోక్మన్ కేసు విచారణలో స్మిత్‌ను విచారించారు. అందుకు సహకరించానని స్మిత్ ఒప్పుకున్నారు. 15 ఏళ్లుగా వివిధ రకాల ట్రస్ట్‌లు, కార్పొరేషన్ల ద్వారా ఫారెన్ ఫండ్లను తప్పుదారి పట్టించిన స్మిత్ వాటి ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు డేవిడ్ ఆండర్సన్ పేర్కొన్నారు. వీటికి సంబంధించి 139 మిలియన్ డాలర్లు చెల్లించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి అధికారులు మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.