Robert Vadra hails 'Bharat Jodo Yatra', likens Rahul to Shirdi's Saibaba
mictv telugu

నాడు షిర్డీ సాయి చేసిందే నేడు రాహుల్ చేస్తున్నారు: రాబర్ట్ వాద్రా

October 31, 2022

దేశాన్ని ఐక్యం చేయడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించారని తెలిపారు ప్రముఖ వ్యాపారవేత్త, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా. ఆదివారం మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా మందిరాన్ని దర్శించుకున్నారు రాబర్ట్ వాద్రా. అనంతరం రాహుల్ గాంధీ జోడో యాత్రపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాయిబాబా చేసిన పనినే ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్నారన్నారు.

“లక్షలాది మంది ప్రజలు నిత్యం షిర్డీ వచ్చి సాయిబాబా దర్శనం చేసుకుంటారు. వారి భావాలు ఏమిటో నేను తెలుసు కోవాలనుకుంటున్నాను. బాబా కులమతాలకు అతీతంగా.. ప్రజలంతా ఐక్యంగా ఉండాలని సందేశం ఇచ్చారు. ఇప్పుడు దేశానికి ఇదే కావాలి. ప్రస్తుతం రాహుల్ ఆలోచన కూడా ఇదే. సర్వధర్మ సమానత్వం అనే ఆలోచన కూడా బాబాకు, రాహుల్ కు ఉందన్నారు” రాబర్ట్. రాహుల్‌ ఆలోచనా విధానం అందరూ ఐక్యంగా ఉండాలన్న సాయిబాబా ఆలోచన విధానాన్ని పోలి ఉందని వ్యాఖ్యానించారు. ‘‘రాహుల్‌, ప్రియాంకా తమ పోరును ఆపరు. మేం ప్రజలతో కలిసి ఉన్నాం. మేం వారికోసం ఐక్యంగా పనిచేస్తాం’’ అని వాద్రా అన్నారు.

ఈ సంద‌ర్భంగా సంస్థాన్ సీఈవో భాగ్య‌శ్రీ బ‌నాయ‌త్ రాబ‌ర్ట్ వాద్రాకు సాయి విగ్ర‌హం ఇచ్చి స‌త్క‌రించారు. కాగా, వాద్రా వెంట స్థానిక కాంగ్రెస్ నేత డాక్ట‌ర్ ఏక్‌నాథ్‌, షిరిడీ సంస్థాన్ ట్ర‌స్ట్ మాజీ మెంబ‌ర్ అవినాశ్ త‌దిత‌రులున్నారు.