ఏ రెస్టారెంట్ కి వెళ్లినా ఆర్డర్ తీసుకోవడానికి ఒకరు.. వచ్చినవి వడ్డించడానికి ఒకరు ఉంటారు. ఇలా రెస్టారెంట్ అంతా మనతో పాటు వీరి సందడి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం తినేవాళ్లు మాత్రమే కనిపిస్తారు. వడ్డించేవాళ్లు, తయారు చేసేవాళ్లే ఉండరు.
రెస్టారెంట్ కి వెళ్లగానే ‘ఏం తీసుకుంటారు సార్, మేడమ్?’ అంటూ మనల్ని అడిగి, ‘ఇది వడ్డించుకోండి.. అది తినండి’ అంటూ కొసరి కొసరి వడ్డించే మనుషులే కరువవబోతున్నారు. అవును మీరు విన్నది నిజం. ఒక రెస్టారెంట్ లోకి వెళితే ఒక్కోసారి మీరు తప్ప మరో మనిషి కూడా ఉండకపోవచ్చు. అలాంటి రెస్టారెంట్ కి అంకురార్పణ జరిగింది. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించినా.. అక్షరాలా నిజం.
మెక్ డీలో..
యూఎస్ లో మెక్ డొనాల్డ్ మొట్టమొదటి ఆటోమేటెడ్ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ మెక్ డీ అవుట్ లెట్ టెక్సాస్ లోని ఫోర్ట్ వర్త్ శివారు ప్రాంతమైన వైట్ సెటిల్ మెంట్ లో ప్రారంభించబడింది. మనుషులు లేని ఈ రెస్టారెంట్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. ఇక్కడ లోపలికి ప్రవేశించగానే.. కౌంటర్ స్క్రీన్ పై మీకు కావాల్సినవి కనిపిస్తాయి. ఒక క్లిక్ తో ఆర్డర్ చేయాలి అని చూపిస్తుంది. కొన్నిసార్లు రోబోలు ఆర్డర్ చేసిన ఆహారాన్ని తీసుకువస్తాయి. మీరు డ్రైవ్ త్రూ ద్వారా వెళితే.. ఆన్ లైన్ లో ముందుగా ఆర్డర్ చేయాలి. ఆ పై ఆహారానిని డెలివరీ చేయడానికి ఆటోమెటెడ్ మెషీన్ కనిపిస్తుంది.
ప్రయోగం మాత్రమే..
ప్రస్తుతానికి మెక్ డొనాల్డ్స్ ఈ ప్రదేశంలో మాత్రమే దీనిని పరీక్షిస్తున్నది. ప్రయాణం చేసే వ్యక్తుల కోసం ఈ లొకేషన్ లో ఇది రూపొందించారు. కస్టమర్స్ తమ ఆర్డర్స్ ను కన్వేయర్ బెల్ట్ నుంచి స్వీకరిస్తారు. అయితే ఈ రోబో మెక్ డీ మీద మిశ్రమ స్పందన వినిపిస్తున్నది. కొందరు ఉద్యోగులను ఇలా తీసేసి రోబోలను పెట్టుకోవడం ఏంటని అంటున్నారు. కొందరేమో.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అక్కడ కనిపిస్తుందంటూ కామెంటుతున్నారు.