వీధికుక్కలకు రోహిత్ శర్మ రూ. 5 లక్షలు  - MicTv.in - Telugu News
mictv telugu

వీధికుక్కలకు రోహిత్ శర్మ రూ. 5 లక్షలు 

March 31, 2020

Rohit Sharma donates Rs 80 Lakh

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి సెలబ్రెటీలు అండగా నిలుస్తున్నారు. వారికి తోచిన విధంగా ఆర్థిక సాయం చేస్తూ.. లాక్‌డౌన్ కష్టాలు అనుభవిస్తున్నవారికి అండగా ఉంటున్నారు. ఇటీవల విరాట్ కొహ్లీ రూ. 3 కోట్ల విరాళం ఇస్తామన్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ కూడా రూ. 10 లక్షలు ప్రకటించారు. పీవీ సింధు కూడా తన వంతుగా 10 లక్షలు సాయం అందించింది. వీరి బాటలోనే క్రికెటర్ రోహిత్ శర్మ కూడా ముందుకు వచ్చారు. కరోనా కట్టడి కోసం రూ. 80 లక్షల విరాళం ప్రకటించారు. 

ఆయన ఇచ్చిన విరాళాల్లో వీధి కుక్కలకు కూడా బడ్జెట్ కేటాయించారు. వాటి సంక్షేమం కోసం రూ. 5 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘మన దేశం తిరిగి నిలబెట్టాల్సిన అవసరం మనకు ఉంది. నేను నా వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నాను. పీఎం కేర్ ఫండ్స్‌కు రూ.45 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు 25 లక్షల రూపాయలు, ఫీడింగ్ ఇండియాకు రూ.5 లక్షలు, వీధి శునకాల సంక్షేమ నిధికి రూ.5 లక్షలు ఇస్తాను’ అని తెలిపారు. కాగా కరోనా వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ విధించడంతో వీధి కుక్కలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో వారికి కూడా ఆహారం అందించేందుకు సాయం అందించారు. రోహిత్ చూపిన చొరవపై జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.