బంగ్లాదేశ్ తో రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయినా కెప్టెన్ రోహిత్ శర్మ పోరాటాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. బొటనవేలికి గాయమై కుట్లు పడ్డా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి బంగ్లా బౌలర్లను వణికించిన తీరును అభిమానులు ప్రశంసిస్తున్నారు. కేవలం 28 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సులతో విరుచుకుపడ్డ వైనాన్ని వేనోళ్లా పొగుడుతున్నారు. మ్యాచులో ఓటమికి పలు కారణాలు ఉన్నా.. రోహిత్ శర్మకు స్ట్రైక్ రొటేట్ చేయకుండా రెండు ఓవర్లు మింగేసిన సిరాజ్ ను విమర్శిస్తున్నారు.
ఏది ఏమైనా మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. దాంతో పాటు సిరీస్ కూడా చేజారింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ అరుదైన క్లబ్ లో చేరాడు. సిక్సర్ల స్పెషలిస్టుగా పేరొందిన రోహిత్ శర్మ ఈ మ్యాచులో ఐదు సిక్సులు కొట్టి అంతర్జాతీయ క్రికెట్ లో 500 సిక్సులు కొట్టిన రెండో ఆటగాడిగా, తొలి భారత బ్యాట్స్ మెన్ గా రికార్డులకెక్కాడు. ఇతని కంటే ముందు క్రిస్ గేల్ 553 సిక్సర్లతో ముందున్నాడు. మూడో స్థానంలో షాహిద్ అఫ్రిదీ 476, బ్రెండన్ మెక్ కల్లమ్ 398, ధోనీ 359 సిక్సులతో వరుస స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ ఇంకొంతకాలం క్రికెట్ ఆడే సామర్ధ్యం ఉంది కాబట్టి గేల్ రికార్డు కూడా బద్దలు కొడతాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.