కివీస్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించాడు. 90 బంతుల్లో 105 పరుగులతో హార్ధిక్ పాండ్యాతో కలిసి క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులుగా ఉంది. 32 ఓవర్లు పూర్తవగా, ఇంకా 18 ఓవర్ల ఆట మిగిలి ఉంది. భీకర ఫాంలో ఉన్న కోహ్లీ 8 పరుగులు చేసి వెనుదిరగగా, రోహిత్ శర్మ 34, సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు చేశారు. ఇక ఈ మ్యాచులో భారత కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచులో రెండు సిక్సర్లు కొట్టి ధోనీ పేరిట ఉన్న 123 సిక్సర్ల రికార్డును సవరించాడు. మొత్తం 125 సిక్సర్లతో రోహిత్ టాప్ లో ఉండగా, మూడో స్థానంలో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ 71 సిక్సులతో ఉన్నాడు.