rohith sharma injured in practice session
mictv telugu

రోహిత్ శర్మకు గాయం..సెమీస్‌కు డౌటే..

November 8, 2022

ఇంగ్లాండ్‌తో జరగబోయే సెమీస్‌కు ముందు భారత్ జట్టుకు షాక్ తగిలింది. నెట్స్‌లో ప్రాక్టిస్ చేస్తున్న టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ కుడి చేతికి బంతి తగలడంతో విలవిలలాడాడు. వెంటనే ప్రాక్టిస్‌ను వదిలి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోస్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో దెబ్బ తగిలిన చేతికి రోహిత్ శర్మ ఐస్ ప్యాక్ తో మర్ధన చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికే బ్యాట్ పట్టిన కాస్త ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. రోహిత్ పరిస్థితిపై బీసీసీఐ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో ఇంగ్లాండ్ తో జరిగే సెమీస్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

ఈ నెల 10న జరగనున్న టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడబోతోంది. కెప్టెన్‌గా జట్టును బాగా నడిపిస్తున్న రోహిత్ బ్యాటర్‎గా మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. ఐదు మ్యాచ్‌లో కేవలం 109.88 స్ట్రైక్ రేట్ లో 89 పరుగులు మాత్రమే చేసాడు. వీటిలో నెదర్లాండ్స్ పై 53 పరుగులు తప్ప చెప్పుకోదగ్గ స్కోర్లు ఎక్కడా లేవు. సెమీస్‌లో నైనా చెలరేగుతాడని ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో రోహిత్ గాయపడ్డాడు అనే వార్త అభిమానులను కలవరపెడుతోంది.