పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలలో అపశృతి దొర్లింది. టీటీడీ భక్తి చానెల్ అయిన ఎస్వీబీసీ చానల్ కార్యక్రమాలు ప్రసారమయ్యే టీవీ స్క్రీన్లపై అరగంట వరకు సినిమా పాటలు ప్రసారమయ్యాయి. ఈ ఘటనతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పలువురు ఆ దృష్యాలను తమ సెల్ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయంపై అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ.. సెట్ టాప్ బాక్సులో లోపం కారణంగా హిందీ సినిమా పాటలు ప్రసారమయ్యాయని, సిబ్బంది వెంటనే గుర్తించి సరిచేశారని వివరణ ఇచ్చారు.
దేవుడంటే ఆటలాటలా వుందా? ఏడుకొండలవాడి సన్నిధిలో సినిమా పాటలా? భక్తులకి నరకం చూపుతున్నారు. పవిత్రత మంటగలుపుతున్నారు. గోవిందనామస్మరణ మారుమోగే తిరుగిరులపై సినిమా పాటల ప్రదర్శన దారుణం. ఈ అపచారాన్ని కవర్ చేసేందుకు రేపు ఏ సినిమాటిక్ కథ వినిపిస్తారో! pic.twitter.com/7G55HI6YWf
— Lokesh Nara (@naralokesh) April 22, 2022
ఇదిలా ఉండగా, ఈ విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనీ, అసలు ఛానెల్ నిర్వహణ రాజకీయ నాయకుల చేతుల్లో ఎందుకు ఉందని ప్రశ్నించారు. ధర్మప్రచార నిధులు దాదాపు 80 శాతం ఎస్వీబీసీ ఛానెల్కే కేటాయిస్తున్నారని, అయినా ఇలాంటివి జరగడం ఆవేదన కలిగిస్తుందన్నారు.