వండర్ గార్డెన్ ఈ మిద్దె మీది తోట ! - MicTv.in - Telugu News
mictv telugu

వండర్ గార్డెన్ ఈ మిద్దె మీది తోట !

July 10, 2017

హైదరాబాదు నగరంలో ఇప్పుడు ‘ రూఫ్ గార్డెన్ ’ చాలా ఫేమస్, చాలా మందికి ఇన్స్పిరేషన్. మందులతో పండని నాచురల్ కూరగాయలకు కేరాఫ్ అడ్రస్ రూఫ్ గర్డెన్. ఇంతకూ ఈ రూఫ్ గార్డెన్ అంటే ఏమనుకుంటున్నారు ? మిద్దె మీద తోటన్నమాట. అంటే మన ఇంటి డాబా మీద చక్కని తోట. నో ఫెస్టిసైడ్స్, నో కెమికల్ ఫర్టిలైజర్స్, ఓన్లీ కంపోస్ట్ ఎరువులు, పశువుల పేడతో, చీడ పీడల నివారణకు వేప నూనెతో పండే ఏక్ దమ్ దేశీ కూరగాయలు, పళ్లు, ఆకు కూరలు. వండర్ ఫుల్ గార్డెన్ ఇది. దీన్ని టెర్రస్ గార్డెన్ అని కూడా అంటారు. విచిత్రంగా వుంది కదూ ? తోటంటే ఏ ఎకరమో, రెండెకరాలొ అనుకున్నట్టున్నారు. కానీ ఇది అందుకు పూర్తి భిన్నంగా ఇంటి పైకప్పు మీద ఏర్పడ్డ తోట. దీని ఆర్కిటెక్టు, అదే డిజైనర్, రూపకర్త, సృష్ఠికర్త ఎవరనుకుంటున్నారూ.. మన తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి సారు.

ఆయన కృషికి తార్కాణంగా నిలిచింది ఈ తోట. ఇప్పుడున్న ఆధునిక వ్యవసాయ పధ్ధతిలో విషపూరితమైన పురుగుల మందులు వాడి పంటలు పండిస్తున్నారు. వాటి వల్ల పురుగులు చచ్చిపోతాయి, మరి దానితోనే పండిన ఆ మందులు మనిషి ఆరోగ్యం మీద ప్రభావం చూపవా ? అనే క్వశ్చన్ ఒకటికి పది సార్లు వేస్కొని ఈ తోటకు మెరుగులు దిద్దారు. గత 27 ఏళ్ళుగా ఆయన తన చేత్తో ఈ తోటలో పండించిన కూరగాయలే తింటున్నారు. తనతోపాటు ఇంటిల్లిపాదికి చక్కని ఆరోగ్యాన్ని పంచుతున్నారు.

వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు గనక ఆయన జీన్స్ నుండి మట్టి మనిషి ఈ ఆధునికతలో కొట్టుకుపోలేడు. వ్యవసాయం అంటే ఫస్ట్ నుండీ ఆయనకు చచ్చేంత ప్రేమ. ఏం చెయ్యాలి ? ఉద్యోగం వదిలేసి పూర్తిగా వ్యవసాయం చెయ్యలేని పరిస్థితి. గోదావరి ఖని సింగరేణిలో మైనింగ్ సర్దార్ గా ఉద్యోగం చేస్తూనే తనలోని మట్టిమీద మమకారాన్ని చంపుకోలేకపోయారు. ఆ క్వార్టర్స్ లో వున్న ఆ కొద్ది స్థలంలో చిన్నగా కూరగాయల తోటను వేసాడు. మనం వండిందే కాదు మనం పండించిందే తినాలి. అదీ విషాలను వాడి కాదు. స్వచ్ఛంగా పండే కూరగాయలను మాత్రమే తినాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అలా కొంత కాలానికి 2010లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాదొచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు.

తోట కోసం ఇక్కడ ఖరీదైన స్థలాలు కొనలేమని, ఇంటి డాబామీదే తోట ఏర్పాటు చేస్కుందామని బిల్డర్ ను సలహా అడిగితే తను ఇంటికేం కాదు బాగానే వుంటుందనే సరికి ఈ తోట నిర్మాణం వితౌట్ కూలీలు, తనే సొంతంగా కష్టపడి నిర్మించుకున్న అందమైన బృందావనం ఇది. ఇప్పటివరకు ఆయన ఏరోజూ మార్కెటుకు వెళ్ళి మందులతో పండిన కూరగాయలు, పళ్లు కొన్నది లేదు. నాచురల్ గా తను పండిచినవే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న ప్రాకృతిక హృదయుడు తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి సారు. ఉప్పల్ – ఘట్ కేసర్ల నడుమ  నారపల్లిలో వుంటుంది ఈ మిద్దెతోట. అక్కడికొక్కసారి వెళితే తిరిగి రాబుద్దికాదు తెల్సా ? అంత అందంగా, ఆహ్లాదంగా వుంటుంది. కళ్ళకింపైన గ్రీనరీని చూసి మీ మనసు ఉవ్వీళ్ళూరుతుంది. ఇలా అందరు ఈ సారును చూసి ఇన్ స్పైరైతే హాయిగా ఇంటి మీదే కూరగాయలు పండించుకొని చక్కని ఆరోగ్యాన్ని పది కాలాలు పచ్చగా కాపాడుకోవచ్చు. మరి ఈ ‘ అప్నీ మెహనత్ అప్నా దమ్ దార్ ఖానా ’ గురించి తెలుసుకోవాలంటే చలో నారపల్లి !