రొటీన్‌ హారర్ కామెడీ

ప్రియుడు నాగచైతన్యను పెళ్లాడి ఇటీవలే అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టింది సమంత. పెళ్లి తర్వాత విడుదలైన ఆమె తొలి చిత్రం  మామ నాగార్జునతో కలిసి నటించిన ‘రాజుగారిగది-2’. మామ, కోడలు కలసి నటించిన ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. నాగార్జున, సమంత తమ కెరీర్‌లో నటించిన తొలి హారర్ సినిమా ఇదే కావడం, గత ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించిన రాజుగారి గదికి సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి  నాగార్జున, సమంత ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకున్నారు.  రాజుగారి గది-2 ప్రేక్షకుల్ని ఎలా భయపెట్టిందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే….

రుద్ర(నాగార్జున) ప్రపంచంలోనే అత్యుత్తమ  మెంటలిస్ట్‌లలో ఒకరు. సైన్స్‌తో పాటు హిందూ  సంప్రదాయాలను సమానంగా గౌరవిస్తుంటాడు. ఎదుటివారి మనసులో ఏముందో ఇట్టే చెప్పేయగలడు. తన శక్తిసామర్థ్యాలతో పోలీసులు ఛేదించలేని ఎన్నో నేరాలను పరిష్కరిస్తుంటాడు. మరోపక్క.. అశ్విన్, తన ఇద్దరు ప్రాణమిత్రులతో కలసి ఓ రిసార్ట్‌ను కొనుగోలు చేస్తాడు. ఆ రిసార్ట్‌లో ఓ ఆత్మ వారిని భయపెడుతూ ఉంటుంది. ఆ ఆత్మను అక్కడ నుంచి వెళ్లగొట్టి తమ వ్యాపారాన్ని సక్రమంగా నడిపించేలా చూడమని  ముగ్గురు మిత్రులు రుద్ర సహయాన్ని కోరుతారు. ఆ ఆత్మ అమృత(సమంత) అనే అమ్మాయిది.  రుద్ర ఈ సంగతి తెలుసుకుంటాడు. అమృత ఎవరు? ఆమె ఎందుకు చనిపోయింది? ఆత్మగా మారి ఆ రిసార్ట్‌లో ఎందుకున్నది? ఆమె మరణానికి తనతో పాటు చదువుకున్న అమ్మాయి కిరణ్(అభినయ) ఎలా కారణమయ్యింది? ఆత్మ కోరికను రుద్ర ఎలా నెరవేర్చాడు? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. 

జీవితం ఎప్పుడూ మనల్ని ఓడించడానికే ప్రయత్నిస్తుంటుంది. గెలవడానికి ధైర్యంతో పోరాడాలి. చనిపోవడానికి వంద కారణాలు కనిపిస్తుంటాయి. కానీ బతకడానికి దారుల్ని అన్వేషిస్తూ  ముందుకుసాగాలనే సందేశాన్ని ఈ సినిమాలో చూపించారు దర్శకుడు ఓంకార్. ప్రస్తుతం సోషల్‌ మీడియా, ఇంటర్‌నెట్ రాకతో అమ్మాయిలు తమ ప్రమేయం లేకుండా కొన్నిసార్లు చిక్కుల్లో పడుతున్నారు. సమస్యలను దీటుగా ఎదుర్కొని పోరాడాలి తప్ప అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాలనుకోవడం తప్పు  అనే పాయింట్‌ ఇందులో ఉంది. దీనికి కమర్షియల్‌ హంగులు, హీరోయిజాన్ని  మేళవించి సినిమాను తెరకెక్కించారు. చెప్పాలనుకున్న పాయింట్  మంచిదే అయినా చెప్పిన తీరులో కొత్తదనం లేదు. 

మలయాళంలో విజయవంతమైన ‘ప్రేతమ్‌’లోని మూలకథను తీసుకొని ఈ సినిమాను రూపొందించినట్లు ప్రచార వేడుకల్లో చెప్పారు ఓంకార్. కానీ మాతృకను యథాతథంగా కాపీ చేశారు.  ఓ ఆత్మ తన మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి తపించడం, అందుకు ఓ వ్యక్తి  సహాయపడటమనే కథాంశం మలయాళ ప్రేక్షకులకు కొత్త. కానీ  తెలుగు తెరపై ఈ పాయింట్‌తో లెక్కకు మించి సినిమాలు రూపొందాయి. ఈ హారర్ కామెడీ ట్రెండ్‌ను అన్ని విధాలుగా తెలుగు దర్శకులు వాడేశారు. రాజుగారి గదితో హారర్ కామెడీ సినిమా చేసి విజయాన్ని అందుకున్నారు ఓంకార్. దాంతో మరోసారి అదే బాటను అనుసరించి ఈ సినిమాను తెరకెక్కించారు. పరుకు హారర్ సినిమా అయినా  ప్రేక్షకుల్ని భయపెట్టే సన్నివేశాలు  ఈ సినిమాలో కనిపించవు.  జబర్దస్త్‌ బ్యాచ్ చేసే కామెడీ సన్నివేశాలతో నిదానంగా మొదలైన సినిమా.. నాగార్జున పాత్ర పరిచయంతో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా మారుతుంది. అమృత ఎవరు, ఆమె కథేమిటో తెలుసుకోవడం కోసం  నాగార్జున చేసే ప్రయత్నాలతో ఆసక్తికరంగా సాగుతుంది.  పతాక ఘట్టాలు సినిమాను నిలబెట్టాయి. నాగార్జున, సమంత పాత్రల మధ్య సాగే సంభాషణతో పాటు అమృత మరణానికి కారణమైన వారిని కనిపెట్టే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కథలో బలం లేకపోవడంతో సాధారణ హారర్ కామెడీ చిత్రంగా రాజుగారి గది-2 నిలిచిపోయింది.  

హారర్‌ కామెడీ కథలో నటించడం నాగార్జున, సమంతలకు ఇదే తొలిసారి. ఆ ఉద్దేశ్యంతోనే వారు ఈ సినిమాను అంగీకరించారు.  నాగార్జున పాత్రచిత్రణ నవ్యరీతిలో సాగింది. స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. సినిమా పూర్తి భారాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించారు. సమంతది అతిథి పాత్రే అయినా సినిమాకు కీలకంగా నిలిచింది. ఎమోషనల్ సన్నివేశాల్లో పరిణితితో కూడిన నటనను ప్రదర్శించింది. సగటు మధ్యతరగతి అమ్మాయికి సమస్య ఎదురైతే ఆమె పడే ఆవేదనను, బాధను సహజంగా ఆవిష్కరించిన తీరు బాగుంది.  పతాక ఘట్టాల్లో ఆమె  నటన మనసుల్ని కదలిస్తుంది. నాగార్జున, సమంత మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. సమంత తండ్రిగా రావు రమేష్ కనిపించేది కొద్ది సేపే అయినా తన ముద్రను చాటుకున్నారు. సీరత్‌ కపూర్‌ను కేవలం గ్లామర్ కోసమే సినిమాలో చూపించారు. మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ఆమె పాత్రను తీర్చిదిద్దారు. వెన్నెల కిషోర్, ప్రవీణ్, ఆశ్విన్ త్రయం చేసే కామెడీ కొన్ని చోట్ల పర్వాలేదనిపించింది.

హారర్ సినిమాకు తగినట్లుగా తమన్ నేపథ్యసంగీతం బాగా కుదిరింది. థీమ్ మ్యూజిక్ అలరిస్తుంది. గ్రాఫిక్స్ హంగులతో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి.  తక్కువ బడ్జెట్‌లో అయినా ఉన్నతంలో సినిమాను చక్కగా తీర్చిదిద్దారు. దివాకరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ‘అమ్మాయిని చులకన చేసి మాట్లాడేముందు అమ్మాయి అనే పదంలో అమ్మ ఉందని గుర్తుంచుకో’ అంటూ మహిళల ఆవేదనను తన సంభాషణల ద్వారా అర్థవంతంగా చెప్పారు అబ్బూరి రవి. 

రాజుగారిగది-2 రొటీన్‌ హారర్ కామెడీ చిత్రం. నాగార్జున, సమంత సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. వారి ఇమేజ్, స్టార్‌డమ్‌లను నమ్ముకొని దర్శకనిర్మాతలు చేసిన ప్రయత్నమిది. అక్కినేని అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే హంగులు ఎక్కువగా ఉన్నాయి. 

2.75/5

SHARE