రౌడీ ప్రియురాలు.. వేటకొడవలితో వెంటాడింది.. - MicTv.in - Telugu News
mictv telugu

రౌడీ ప్రియురాలు.. వేటకొడవలితో వెంటాడింది..

March 6, 2018

ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత. ఓ వీధిరౌడీతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఒక యువతికి రౌడీ లక్షణాలు నరనరానా ఒంటబట్టాయి. తన ప్రియుడితో గొడవ పెట్టుకున్న ఓ యువకుడిపై ఆమె వేటకొడవలితో దాడి చేయడానికి వేటాడింది. ఈ ఉదంతం గుజరాత్‌లోని సూరత్ నగరంలో జరిగింది. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది.

నగరానికి చెందిన అస్మితా గోహిల్ అనే 20 ఏళ్ల యువతి.. ఎన్నో కేసులున్న వీధిరౌడీ సంజయ్‌ అలియాస్‌ భూరోను కొన్నేళ్లుగా ప్రేమిస్తోంది. అతనితో కలసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు.. ‘రౌడీవెధవతో ప్రేమాయణం ఏంటి? చచ్చిపోతావే..’ అని హితబోధ చేశారు. అయితే పూర్తిగా ప్రేమ మైకం కమ్మిన అస్మితకు ఆ మాటలు చెవికెక్కలేదు.

దీంతో తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోంచి గెంటేశారు. తర్వాత ఆమె సంజయ్‌తో కలిసి ఉంటోంది. ఇటీవల సంజయ్‌తో ఓ యువకుడు గొడవ పెట్టుకున్నాడు. ఇది అస్మితకు తెలిసింది. ఆమె వేటకొడవలి తీసుకుని ఆ యువకుడిపై దాడి చేయబోయింది. అతడు పారిపోతున్నా వెంటాడింది. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో రౌడీ జంట పరారైంది.