హైదరాబాద్‌లో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. ప్రధానంగా పాతబస్తీ పరిధిలో వీరి ఆగడాలకు అంతులేకుండా పోతుంది. తమకు ఎవరూ అడ్డుతిరగరనే ధైర్యంతో సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నిత్యం మద్యం మత్తులో ఊగుతూ..కత్తులు చేతపట్టి బెదిరింపులకు దిగుతున్నారు. చిన్ని చిన్న గొడవలకు నడిరోడ్లుపై కత్తులతో దాడులకు తెగబడుతున్నారు. తాజాగా రౌడీషీటర్ అలీ-బా-ఈసా అరాచకాలు వెలుగులోకి వచ్చాయి..
బెదిరించి..బట్టలు తీపించి
అమ్మాయిలు, ట్రాన్స్ జెండర్లతో ముజ్రాలు చేయించడం పాతబస్తి శివారులో అక్కడక్కడా, అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అర్ధనగ్న నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు పండగులు, ఫంక్షన్ కార్యక్రమాలలో ఏర్పాటు చేస్తారు. ఈ విధంగానే డ్యాన్స్ లు చేయాలంటూ యువకుడిని రౌడీషీటర్ అలీ-బా-ఈసా బలవంతం పెట్టాడు. రూమ్‌లో బంధించి బలవంతంగా అర్ధనగ్ననృత్యాలు చేయించాడు. యువకుడిని కత్తితో బెదిరించి బలవంతంగా దుస్తులు తీయించేశాడు. కేవలం ఒక అండర్ వేర్‌తో డాన్స్ వేస్తున్న యువకుడి చుట్టూ కత్తి పట్టుకొని కుప్పిగెంతులు వేస్తూ రాక్షాసానందం పొందాడు. మూడు నెలల క్రితం జరిగిన ఈ వీడియాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నడిరోడ్డుపై కత్తితో దాడి
సదరు రౌడీషీటర్ అలీ-బా-ఈసా నిత్యం గొడవలకు పాల్పడతాడని తెలుస్తోంది. ఈనెల 20న కూడా జిమ్ ఎదుట పార్కింగ్ విషయంలో జరిగిన గొడవలో ఇతడు వీరంగం సృష్టించాడు. మరో రౌడీషీటర్ సులేమాన్ బామ్(40)మీద కత్తితో దాడిచేసి పరారయ్యాడు. పోలీసులు అదే రోజు అలీపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఇంతలోనే అతని పైశాచికత్వాన్ని రుజువు చేస్తూ అర్థనగ్న వీడియో బయటకు రావడం గమనార్హం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.