జూలో విషాధం.. రాయల్ బెంగాల్ టైగర్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

జూలో విషాధం.. రాయల్ బెంగాల్ టైగర్ మృతి

July 5, 2020

Royal Bengal Tiger no more at Nehru Zoological Park

హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్‌ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్ కదంబ శనివారం రాత్రి మృతిచెందింది. 11 సంవత్సరాల వయసున్న ఈ మగపులికి ఎలాంటి అరోగ్య సమస్యలు కనిపించలేదని.. అయితే గత కొన్ని రోజులుగా ఆహారం ముట్టకుండా ఉంటున్నదని జూ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు కదంబకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. దాని మృతికి గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. పది రోజుల వ్యవధిలో జూలో పులి చనిపోవడం ఇది రెండవదని అన్నారు. జూన్ 25న కిరణ్ అనే 8 ఏళ్ల వయసున్న మగ తెల్లపులి నియోప్లాస్టిక్ కణితి కారణంగా మరణించిందని వెల్లడించారు. రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, పాథాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ లక్ష్మణ్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఆదివారం కదంబ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. 

మరింత వివరణాత్మకమైన పరిశీలన నిమిత్తం అవసరమైన రక్త, కణజాల నమూనాలను సేకరించి రాజేంద్రనగర్‌ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, శాంతినగర్‌లోని హైదరాబాద్ వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, అత్తాపూర్‌లోని లాకోన్స్-సీసీఎంబీకి పంపినట్లు జూ అధికారులు చెప్పారు. కాగా, జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా మార్చి 2014లో కర్ణాటక మంగుళూరులోని పిలుకుల బయోలాజికల్ పార్క్ నుంచి కదంబను ఇక్కడికి తీసుకువచ్చారు. కదంబ మరణంతో హైదరాబాద్‌ జూపార్కులో 8 పెద్దవి, 3 పిల్లలతో మొత్తం 11 రాయల్ బెంగాల్ టైగర్స్ (పసుపు), 9 రాయల్ బెంగాల్ టైగర్స్ (తెలుపు) పెద్దవి ఉన్నాయి.