‌ బుల్లెట్‌ బైక్‌ కోసం గుడి.. దండలేసి పూజలు కూడా.. - MicTv.in - Telugu News
mictv telugu

‌ బుల్లెట్‌ బైక్‌ కోసం గుడి.. దండలేసి పూజలు కూడా..

October 24, 2020

nmm

మన దేశంలో దేవుళ్లకు గుడి కట్టడం చూశాం. భక్తి ఇంకా ఎక్కువ అయితే అభిమాన నేతలు, నటులకు, ఇతర ప్రముఖులకు కూడా కొంత మంది ఆలయాలు నిర్మించారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలంగాణలో ఓ వ్యక్తి కూడా గుడి కట్టించాడు. కొంత మంది బాబాలకు కూడా మందిరాలు ఉన్నాయి. కానీ రాజస్థాన్‌లో మాత్రం ఓ విభిన్నమైన ఆలయం ఉంది. ప్రతి రోజూ చాలా మంది భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అయితే అక్కడ పూజలు అందుకుంటున్నది.. ఏ దేవుడో, మనిషో కానే కాదు. 350 సీసీ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్. రాజస్థాన్‌లోని పాలీ దగ్గర ఈ వింత  ఆలయం ఉంది.  

ఈ మందిరం ఏర్పడటానికి పెద్ద చరిత్రే ఉంది. 1988 డిసెంబర్ 2న బుల్లెట్‌పై  ప్రయాణిస్తున్న ఓం బన్నా అనే వ్యక్తి ప్రమాదం బారినపడి చనిపోయాడు. పోలీసులు ఆ బైక్‌ను తీసుకెళ్లి స్టేషన్‌లో సీజ్ చేశారు. తెల్లారేసరికి బైక్ కనిపించలేదు. ఏమైందని గాలించగా.. అది యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలోనే పడి ఉంది. మళ్లీ దాన్ని స్టేషన్‌కు తీసుకువచ్చారు. మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. చివరకు బైక్‌లో ఉన్న పెట్రోల్ తీసేసి చూశారు. తిరిగి అక్కడికే వెళ్లిపోయింది. ఈ విషయం స్థానికంగాప్రచారంలోకి వచ్చింది. ఓం బన్నా ఆత్మ బైక్‌లోనే ఉందని అంతా భావించడం మొదలుపెట్టారు. దీంతో దాన్ని ప్రమాదం జరిగిన చోటకు తీసుకెళ్లి ప్రతిష్టించారు. 

అక్కడ ఓ చిన్న స్టేజీ లాంటిది ఏర్పాటు చేసి దానిపై బైక్‌ను నిలిపి ఉంచారు. నిత్య పూజలు చేయడంతో అది ధైవ భూమిగా మారిపోయింది. దానికి బన్నా ఆలయం అనే పేరు కూడా వచ్చింది.  చుట్టుపక్కల వాళ్లు ఓఎం బన్నాకు నివాళులు అర్పించడానికి రావడంతో భక్తుల తాకిడి కూడా పెరిగింది. ప్రతి రోజూ భక్తులు పూజలు చేసి పూలదండలు వేసి, పసుపు, కుంకుమ చల్లి ధైవంగా భావిస్తున్నారు. ఆ వాహనం పక్కనే ఉన్న ఓ చెట్టుకి వాహనదారులు దారాలు కడుతూ మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు.  మొత్తానికి ప్రమాదానికి గురైన ఓ బైక్ ఇప్పుడులా పూజలు అందుకోవడం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.