ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ఈసారి మంత్రివర్గంలో ఎవరికి ఛాన్స్ ఉంటుంది. ఎవరికి ఛాన్స్ ఉండదు అనే అంశంపై నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు జగన్ ముహుర్తం ఫిక్స్ చేశారు. ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతున్న నేపథ్యంలో సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి, కొత్త వారిని మంత్రులుగా నియమించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే రోజా గురించి సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. తొలిసారి మంత్రివర్గంలోనే స్థానం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగినా, చివరి నిమిషంలో రోజాకు ఛాన్స్ దక్కలేదు. ఆ తరువాత కొద్ది రోజులకు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా నామినేటెడ్ పదవి ఇచ్చారు. రెండేళ్లతో ఆ పదవి ముగిసింది. ఇక, ఎన్నికల కోసం సిద్దం చేస్తున్న కేబినెట్ కావటంతో ఈసారి సీనియర్లు, పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారికి స్థానం ఖాయమనే వాదన వినిపిస్తోంది. కావున ఈసారి మంత్రివర్గ విస్తరణలో రోజాకు కచ్చితంగా ఛాన్స్ ఇస్తారని ఆమె అభిమానులు ఫిక్స్ అయ్యారు. అంతేకాకుండా కొన్ని నెలలుగా పార్టీ అభివృద్ది కోసం రోజా పలు సేవలు చేస్తూ, వెన్నుముకగా నిలుస్తున్నారు.
అయితే, ప్రస్తుతం కొనసాగించే వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో ఈసారి చిత్తూరు జిల్లా నుంచి ఆశలు పెట్టుకున్న రోజాతో పాటు, భూమనకు అవకాశం లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. రెడ్డి వర్గానికి ప్రస్తుత కేబినెట్లో నాలుగు స్థానాలే ఉన్నాయి. ఈసారి అదే సంఖ్యకు పరిమితం అవ్వనుంది. చిత్తూరు నుంచి పెద్దిరెడ్డితో పాటుగా ఎస్సీ వర్గానికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. దీంతో మరో రెడ్డి వర్గానికి చెందిన నేతకు ఛాన్స్ లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. అదే విధంగా నెల్లూరు జిల్లా నుంచి సీనియర్ నేతలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు సైతం కేబినెట్లో బెర్తుల కోసం నిరీక్షిస్తున్నారు.
మరోపక్క జగన్ ముందుగా చెప్పినట్టుగా.. అతి త్వరలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఉగాది పర్వదినాన ఈ కార్యక్రమం ఉండనున్నట్టు సమాచారం. మార్చి 27న ప్రస్తుతం ఉన్న మంత్రులు విస్తరణకు ఆమోదంగా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రులు రాజీనామా చేయాలని మౌఖికంగా ఆదేశాలు వెళ్లాయి.