ఐపీఎల్ 2020 సీజన్ ఆసక్తిగా సాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్ తొలి నుంచి అభిమానులను ఆకట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన హోరా హోరీ పేరుతో క్రికెట్ ప్రియులు అసలైన మజా పొందారు. భారీ స్కోర్లు, బౌండరీలతో ఆటగాళ్లు గ్రౌండ్లో పరుగుల వరద పారించారు. ఈ మ్యాచ్‌లో ధోని సేనకు షాక్ తగిలింది. 17 పరుగుల తేడాతో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ సాధించింది. కాగా నిన్నటి ఆటలో ఏకంగా 33 సిక్సర్లు నమోదు కావడం విశేషం.
తొలుత టాస్ గెలిచి చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఆది నుంచే రెచ్చిపోయింది. స్మిత్ తొలిసారి ఓపెనర్‌గా వచ్చి పరుగుల వరద పారించాడు. మరో ఆటగాడు శాంసన్ బంతిని బౌండరీ వైపు బాదుతూ.. 32 బంతుల్లో 74 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఈ భారీ స్కోర్‌ను చేధించేందుకు రంగంలోకి దిగిన చెన్నై కూడా భాగానే రాణించింది. డూప్లెసిన్ సిక్సర్లు బాదుతూ.. 32 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ వరుస సిక్సులు బాదినా బంతులు లేకపోవడంతో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.