బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 95వ అకాడమీ అవార్డ్స్‌లో నాటు నాటు పాటకి ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. అవార్డు గెలుచుకుని రాజమౌళి, కీరవాణి, రాంచరణ్, ఎన్టీఆర్, ఇతర ఆర్ఆర్ఆర్ టీం ఇండియాకి తిరిగొచ్చేశారు కూడా. కానీ ప్రపంచ వ్యాప్తంగా నాటు నాటు వైబ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్కార్ గెలవడంతో విదేశీ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాలో ఉన్న ఇతర దేశాల ఎంబసీ సిబ్బంది కూడా నాటు నాటు పాట ఆస్కార్ విజయాన్ని ఒక పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
తాజాగా జర్మనీ ఎంబసీ సిబ్బంది నాటు నాటు ఆస్కార్ విజయాన్ని తమదైన శైలిలో సెలెబ్రేట్ చేసుకున్నారు. ఢిల్లీలోని చాందిని చౌక్ వద్ద అదిరిపోయేలా డ్యాన్స్ చేసారు. దీనికి సంబంధించిన వీడియోను భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. కొరియన్ ఎంబసీ తరహాలోనే జర్మనీ దౌత్య కార్యాలయ సిబ్బంది కూడా ఢిల్లీ చాందినీ చౌక్ లో నాటు నాటు పాటకు స్టెప్పులేశారని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. చూస్తుంటే నాటు నాటు పాటకు ఎవరు బాగా డ్యాన్స్ చేస్తారో అని దౌత్య కార్యాలయాలు ఒలింపిక్స్ తరహాలో పోటీ పడుతున్నట్టుంది అని చమత్కరించారు. మరి ఈ వరుసలో నెక్ట్స్ డ్యాన్స్ చేసే ఎంబసీ ఏ దేశానిది? అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
The German Ambassador & embassy staff & their rendition of #NaatuNaatu in Chandni Chowk. Following the Korean Embassy’s lead. I love the way this is turning into a diplomatic Olympics of one-upmanship! Ok, which nation’s embassy is next up? pic.twitter.com/Q9Uq62s5QP
— anand mahindra (@anandmahindra) March 19, 2023
ఈ వీడియో చూస్తే ఇండియాలో జర్మనీ ఎంబసీ ఎంత బాగా కలసిపోయారో అర్థం అవుతోంది. అచ్చతెలుగు పాట భావం తెలియనప్పటికీ.. ఆ పాటలో బీట్ వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది అని చెప్పడం లో సందేహం లేదు.