RRR మూవీ రివ్యూ.. - MicTv.in - Telugu News
mictv telugu

RRR మూవీ రివ్యూ..

March 25, 2022

hg

భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన ఆర్‌ఆర్ఆర్ అంచనాలను దాటి దూసుకెళ్తోంది. రాజమౌళి దర్శక నైపుణ్యం, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నటన, భావోద్వేగమైన కథ, విజువల్ వండర్స్, ఫైట్స్ కలిపి చిత్రాన్ని అద్భుత దృశ్యకావ్యంగా తీర్చిదిద్దాయి.

కథ ఎలా ఉంది?
1920ల నేపథ్యంలో కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలసి బ్రిటిష్ వారితో పోరాడితే ఎలా ఉంటుందనే ఊహతో తీసిన సినిమా ఇది. కథలోకి వెళ్తే.. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లిన రామరాజు(రామ్ చరణ్) పోలీసు అధికారిగా పనిచేస్తుంటాడు. జాలి, దయలేని కర్కశ అధికారి అతడు. మరోవైపు ఆదిలాబాద్ నుంచి బ్రిటిష్ అధికారి స్కాట్ దొర గోండు బాలికను ఢిల్లీకి బలవంతంగా తీసుకెళ్తాడు. ఆమెను తిరిగి తీసుకురావడానికి గోండు వీరుడు భీమ్(ఎన్టీఆర్) ఢిల్లీ చేరుకుంటాడు. రామరాజు, భీమ్ ఢిల్లీలో ఎలా కలుసుకున్నారు, వాళ్ల స్నేహం, బ్రిటిష్ పాలకులపై వాళ్ల పోరాటం ఎలా సాగిందో మిలిగిన కథ.

ఎలా చూపించారు?
రామరాజు, భీమ్‌లను పరిచయం చేసే సన్నివేశాలు వారిద్దరి కెరియర్‌లోనే బెస్ట్ అనేవిధంగా తీర్చిదిద్దాడు జక్కన్న. ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటాపోటీగా నటించారు. ఇద్దరూ కలుసుకునే సన్నివేశం అద్భుతం. ఢిల్లీలో ఆంగ్లేయులకు మద్దతుగా చరణ్, వాళ్లకు వ్యతిరేకంగా భీమ్ మధ్య సాగే ఉద్వేగ పోరాటం సమయంలో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలెట్. భీమ్‌ను ప్రేమించే బ్రిటిష్ యువతిగా జెన్నీ(ఒలీవియా), రామరాజు ప్రియురాలిగా, మరదలుగా సీత పాత్రలో(ఆలియా భట్) ఉన్నంత వరకు మెప్పించారు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో అజయ్ దేవగణ్, శ్రియకూ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. ద్వితీయార్థంలో కథ కాస్త సాగదీసినట్లు అనిపించినా, జక్కన్న చివర్లో ఉద్వేగ సన్నివేశాలతో మ్యాజిక్ చేసి ఆ లోపాన్ని అధిగమించారు. బాహుబలి చిత్రంలో విజువల్ వండర్స్ అంటే ఏమిటో తెలుగువారికి అద్భుతంగా పరిచయం చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్‌ను కూడా అదేస్థాయిలో మలిచారు.

సాంకేతికగా ఎలా ఉంది?
కీరవాణి సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. గూస్ బంప్స్ అదిరాయి. కేవలం సంగీతంతోనే కొన్ని సన్నివేశాలు అద్భుతంగా పండాయి. సెంథిల్ కుమార్ కెమెరా పనితనం కనులపండువగా ఉంది. రామరాజు 2వేల మందిలోంచి తనకు కావలసినవాడిని తీసుకొచ్చే సన్నివేశంలో కెమెరా వర్కు చూడాల్సిందేగాని మాటల్లో చెప్పలేం. అప్పటి కాలాన్ని కళ్లకు కట్టే ఆర్ట్ వర్క్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. రమా రాజమౌళి రూపొందించిన దుస్తులు మనల్ని శతాబ్దం వెనక్కి తీసుకెళ్తాయి.

బలాలు
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, రాజమౌళి దర్శకత్వం సినిమాకు బలం. సంగీతం సన్నివేశానికి తగ్గట్లు రోమాంచింతంగా, ఉద్వేగంగా, ఉల్లాసంగా ఉంటుంది. భావోద్వేగ, యాక్షన్ సన్నివేశాలు.

బలహీనతలేమిటి?
రామరాజు తండ్రి(అజయ్ దేవగణ్) కథ చాలా నెమ్మదిగా సాగి విసిగిస్తుంది. కొమురం భీం పాట నిడివి ఎక్కువ కావడం మైనస్సే. ద్వితీయార్థంలో కథంలో వేగం మందగించింది. రాజమౌళి గత సినిమాల్లో మాదిరి కాకుండా ఈ చిత్రంలో కొంతసేపు కథానినికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన బ్రాండ్ అభిమానులకు ఇది నచ్చకపోవడం సహజమే.

ఫైనల్ వర్డ్
ఎమోషనల్ కనెక్షన్‌ ఉన్న ఉన్న సినిమా. బాహుబలి, కేజీఎఫ్‌లతో పోల్చకూడదు. అవి వేరు, ఇది వేరు.