ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంతో అంతర్జాతీయంగా తెలుగు సినిమా పేరు మారుమ్రోగుతుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ అవార్డు దక్కించుకోవడంపై ప్రధాని మోదీ నుంచి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినీ అభిమానులైతే దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ పాటను ఎవరు పాడారు అంటూ చాలామంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.
ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. రాహుల్ సామాన్య కుటుంబం నుంచి వచ్చి పేరు తెచ్చుకుంటే కాలభైరవ సెలబ్రెటీల కుటుంబంలో పుట్టినా, సాధారణంగానే సినీ సంగీత ప్రయాణం మొదలు పెట్టారు. వీరిలో తెలంగాణ బిడ్డ రాహుల్ సిప్లిగంజ్ గురించి చెప్పుకోవాలంటే.. పక్కా హైదరాబాదీ. ‘ఆర్‌ఆర్‌ఆర్(RRR)’ చిత్రం నుంచి ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడం పట్ల అతని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ పాట ప్రయాణంలో తమ బిడ్డ భాగమైనందుకు గర్వంగా ఉందని చెప్పారు. అంతర్జాతీయ వేదికపై తమ కుమారుడు పాడడం నిజంగా చాలా గొప్ప విషయమని చెప్పారు. ఆస్కార్ వరకు వెళతానని రాహుల్ కూడా కలగనలేదని, తమ కుమారుడిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు
హైదరాబాద్ లోని మంగళ్ హాట్ అనే ఓ బస్తీలో పుట్టిన రాహుల్ సిప్లిగంజ్ ఓ మామూలు మిడిల్ క్లాస్ కుర్రాడు. దిగువ మధ్యతరగతి ఇంట్లో పుట్టిన అతడు స్థానిక నారాయణ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. తండ్రికి ఓ సెలూన్ షాప్ ఉంది. అదే ఆ కుటుంబానికి ఆధారం. రాహుల్‌కు చిన్నప్పటి నుంచీ ఆట పాటలంటే మక్కువ. మంగళ్ హాట్‌లో.. రంగు డబ్బాలూ, కంచాలే సంగీత పరికరాలుగా మార్చుకొని తోచిన పాటలు పాడేవాడు. పండిత్ విఠల్ రావు దగ్గర సంగీతం నేర్చుకొని, అక్కడే గజల్స్ పై పట్టు సాధించాడు. గాయకుడిగా బాగా సిద్ధమైన తరవాత, అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగాడు. కానీ, ఆఫర్లు లభించలేదు. దీంతో తానే సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించడం మొదలెట్టాడు.
కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్‌తో గుర్తింపు తెచ్చుకోవడంతో ‘జోష్’ సినిమాలో ఆయనకు అవకాశం వచ్చింది. ‘కాలేజీ బుల్లోడా’ అనే పాటతో రాహుల్ టాలీవుడ్ ఎంట్రీ జరిగిపోయింది. ఎంఎం కీరవాణియే సంగీత దర్శకత్వం వహించిన ‘ఈగ’లో టైటిల్ సాంగ్, దమ్ము చిత్రంలోని ‘వాస్తు బాగుందే’ పాట రాహుల్‌కు బాగా పేరు తెచ్చి పెట్టాయి. ‘రంగస్థలం’లోని టైటిల్ సాంగ్‌తో, ‘ఇస్మార్ట్ శంకర్’లోని పాటలతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోయారు.