RRR టీమ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ - MicTv.in - Telugu News
mictv telugu

RRR టీమ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్

March 23, 2022

 

rr

ఈ నెల 25న విడుదల కానున్న ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం – రణం- రుధిరం) ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా చిత్ర బృందం ఇవాళ హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొంది. దర్శకుడు రాజమౌళి, హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్… రాజ్యసభ ఎంపీ, గ్రీన్ చాలెంజ్ సారథి జోగినపల్లి సంతోష్ కుమార్‌తో మొక్కలు నాటారు. గచ్చిబౌలిలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

‘ప్రకృతి, పర్యావరణం నాకిష్టం. వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తుంటాం’ అని రాజమౌళి తెలిపారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంతోష్ సంకల్పం చాలా గొప్పదని, మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు. బాహుబలి టీమ్‌తో కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. గ్రీన్ ఛాలెంజ్ మరింత విజయవంతంగా కొనసాగాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలని అన్నారు. ఈ భూమిపై మనం అందరమూ అతిథులం మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలని, మన ఇంటి పిల్లలను ఎలా పెంచుతామో మొక్కలనూ అలాగే నాటి రక్షించాలి అని కోరారు. తాను గతంలో కూడా గ్రీన్ ఛాలెంజ్ చేశానని, మొక్కలు నాటిన ప్రతీసారి తెలియని ఉత్సాహం వస్తుందని, ట్రిపుల్ ఆర్ రిలీజ్ సందర్భంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యంత సంతృప్తిని ఇచ్చిందని హీరో రామ్ చరణ్ అన్నారు. సమాజహితమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్‌ను ట్రిపుల్ ఆర్ టీమ్ అభినందించింది. సినిమా మాధ్యమం అత్యంత శక్తివంతమైందని, సమాజానికి చక్కని హరిత సందేశం ఇచ్చే స్ఫూర్తి హీరోలతో పాటు, చిత్ర నిర్మాణంలో భాగం అయ్యే 24 ఫ్రేమ్స్ కళాకారులకు ఉంటుందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. మూవీ రిలీజ్ షెడ్యూల్ లో బిజీగా ఉండికూడా, చొరవ తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న బృందానికి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.