‘RRR’ Wins Best Song at Golden Globes in Hollywood Awards for Indian Film Music
mictv telugu

గోల్డెన్ గ్లోబ్ ‘నాటు నాటు’.. 18 టేకులు.. 80 సిగ్నేచర్ స్టెప్పులు

January 11, 2023

భారతీయ సినిమాకు అందులోనూ ఓ తెలుగు సినిమాకు ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డ్ రావడంపై.. టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా సంతోషం వ్యక్తం చేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ వచ్చినందుకు.. టీమ్ సంబరాలు జరుపుకుంటోంది. బుధవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్‌ వేదికగా జరిగిన అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఆర్ఆర్ ‘ఫ్యామిలీ’.. తాము పడిన కష్టానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని చెబుతోంది. పలువురు సినీ ప్రముఖులంతా ఆర్ఆర్ఆర్ టీమ్‌కు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ పాటకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

దుమ్ము లేవట్లేదని రీషూట్..

అయితే ఈ పాటకు సంబంధించిన ఆసక్తికర విషయాలను మూవీ ప్రమోషన్స్ టైమ్ లో పంచుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. యాంకర్ సుమ చేసిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న..ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ లు ఆ పాట కోసం దాదాపు 18 సార్లు రిహార్సల్స్ చేయించారని చెప్పారు. హీరోలద్దరి డాన్స్‌కి సంబంధించిన ప్రతీ మూమెంట్ సింక్ అవ్వడానికి రాజమౌళి మళ్లీ మళ్లీ డాన్స్ చేయించారని సుమ ముందు వాపోయాడు ఎన్టీఆర్. సింక్ అయ్యాక కూడా స్టెప్స్‌కు అనుగుణంగా దుమ్ము లేవటం లేదని జక్కన్న మళ్లీ రీటేక్ చేయించారని చెప్పాడు.

ఆ స్టెప్‌నే ఫైనల్ చేశారు

కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, రాహుల్ సిప్లిగంజ్ మరియు కాలభైరవల గానం.. ఇలా ఒక్కటేంటీ? ప్రతీ ఒక్కరూ తమ తమ విభాగాల్లో పాటకు ప్రాణం పెట్టారు. ఇక ప్రేమ్‌ రక్షిత్‌ అయితే తన కొరియోగ్రఫీతో నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు. ‘నాటు నాటు’లో హుక్‌ స్టెప్‌ కోసం 80కి పైగా వేరియేషన్‌ స్టెప్స్‌ను ప్రేమ్‌ రక్షిత్‌ బృందం రికార్డు చేసిందట. చివరకు భుజాలపై చేతులు వేసుకుని ఇద్దరూ ఒకే రకంగా కాళ్లు కదిపే స్టెప్‌ను ఓకే చేశారు. ఈ స్టెప్‌ సింక్ అవ్వడానికే హీరోలిద్దరూ 18 టేక్‌లు తీసుకున్నారట. టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్ఫెక్ట్‌గా డ్యాన్స్‌ చేయగల అతి కొద్దిమంది నటుల్లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ టాప్‌లో ఉంటారు. అలాంటి వాళ్లే 18 టేక్‌లు తీసుకున్నారంటే పాట పర్‌ఫెక్ట్‌గా రావడానికి రాజమౌళి ఎంతలా పరితపించారో అర్థం చేసుకోవచ్చు.

అది నిజమైన ప్రెసిడెంట్ బిల్డింగే..

నాటు నాటు సాంగ్‌ను ఉక్రెయిన్‌లో షూట్ చేసినట్లు గతంలో రాజమౌళి చెప్పారు. యుద్ధానికి ముందు ఉక్రెయిన్‌లో షూట్ చేశామని.. పాటలో కనిపించే భవనం ఉక్రెయిన్‌ అధ్యక్షుడిదేనని చెప్పారు. ఆ ప్యాలెస్‌ పక్కనే పార్లమెంట్‌ భవనం కూడా ఉందని కూడా చెప్పారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఒకప్పుడు టీవీ యాక్టర్‌ కావడంతో తాము అడగగానే షూటింగ్‌కు పర్మిషన్ ఇచ్చారని, అది నిజంగా తమ అదృష్టమని చెప్పారు.

ఇక నాటు నాటు సాంగ్ ఆస్కార్ రేసు విషయానికొస్తే.. ఈ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో షార్ట్ లిస్ట్ అయింది. మొత్తంగా 81 పాటలు ఈ కేటగిరీలో పోటీ పడటానికి అర్హత సాధించగా… అందులో 15 పాటలను సెలెక్ట్ చేశారు. ఆ 15 నాటు నాటు సాంగ్ ఒకటి. వీటిలో మళ్ళీ 5 పాటలు నామినేషన్స్‌కు వెళతాయి. ఆ తర్వాత ఐదింటిలో ఒకటి విజేతగా నిలుస్తుంది.