ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అవార్డ్ పడింది. ప్రపంచ సినిమాలను వెనక్కి నెట్టి మరో అవార్డును సొంతం చేసుకుంది. ఫ్యాన్ ఫేవరెట్ మూవీ విభాగంలో గోల్డెన్ టొమాటో అవార్డు దక్కించుకుంది. మూవీ టీమ్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపింది. ఓటు వేసి గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది. అమెరికాకు చెందిన రాటెన్ టొమాటోస్ వెబ్ సైూట్ ప్రతీ ఏడాదీ ఈ అవార్డును ప్రకటిస్తుంది.
2022 ఏడాదికి గానూ ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డును గెలుచుకుంది. ఉత్తమ చిత్రాలుగా నామినేషన్ దక్కించుకుని 2023 ఆస్కార్ బరిలో నిలిచిన టాప్‌గన్: మావరిక్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, అవతార్: ది వే ఆఫ్ వాటర్లను వెనక్కి నెట్టి ఆర్ఆర్ఆర్ నంబర్ 1గా నిలిచింది.
ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయింది. దీనికన్నా ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్, ది ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్, అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ ఆర్ఆర్ఆర్ సినిమా గెలుచుకుంది. రాజమౌళికి ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డును అందించింది.