గోదావరి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం
గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అధికారులతో మాట్లాడిన జగన్ మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబాలకు మంత్రులు, అధికారులు అండగా నిలవాలని సూచించారు.
సహాయక చర్యలపై కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి చేపట్టే చర్యలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సూచించారు.
ఈ ఘటనలో 49 మంది గల్లంతు అవగా, 12 మృతి చెందారు. లైఫ్ జాకెట్లు ధరించిన 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా హైదరాబాద్, వరంగల్, గోదావరి జిల్లాలకు చెందినవారు. 14 మంది వరంగల్‌కు చెందినవారిగా గుర్తించారు. వారిలో 9 మంది గల్లంతు, ఐదుగురు సురక్షితం అని అధికారులు తెలిపారు. 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో పాపికొండలకు వెళ్తుండగా దేవీ పట్నం మండలం కచ్చులూరు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకుల బోటుకు అనుమతి లేదని అధికారులు ఆరోపిస్తున్నారు.