Rs.1000 fine for feeding monkeys in Nallamala Forest, says Officials
mictv telugu

కోతులకు ఆహారం వేస్తే రూ.1000 జరిమానా..!

October 28, 2022

కార్తీక మాసం కదా అని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం వెళ్తున్నారా.? అయితే కచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాలి. లేదంటే జరిమానా చెల్లించుకోక తప్పదు. నల్లమలలోని అటవీ మార్గంలో అకారణంగా వాహనాలు నిలిపినా… చెత్త, ప్లాస్టిక్‌ వేసినా.. మద్యపానం, ధూమపానం చేసినా అపరాధ రుసుం చెల్లించాల్సిందే. దారిలో కోతులకు ఆహారం వేసినా… వాహనాలను 30 కిలోమీటర్లకు మించి వేగంగా నడిపినా జరిమానా తప్పదు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రాన్ని సందర్శించే భక్తులు, పర్యాటకులు నల్లమల అటవీ ప్రాంతానికి రాగానే రోడ్డు వెంట కోతులను చూసి వాటికి ఆహార పదార్థాలు వేస్తుంటారు. కొందరు వాటిపై జాలితో ప్రత్యేకంగా పండ్లు, బిస్కెట్లు కొని తెస్తుంటారు. ఇక నుంచి వాటికి ఆహారం వేస్తే రూ.1000 అపరాధ రుసుం విధిస్తామంటూ అటవీశాఖ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు.

ఇప్పటికే చెక్‌పోస్టుల భారంతో ప్రయాణికులు అల్లాడుతుంటే.. పర్యావరణం , వన్యప్రాణులు కాపాడడం అంటూ ఈ కొత్త రుసుములను మరింతగా వసూళ్లు చేయడం ఏమిటని ప్రజలు మండిపడుతున్నారు. ఈ నిబంధనలపె ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించకుండా… ఉన్నఫళంగా బాదుడేంటని ప్రశ్నిస్తున్నారు. కొత్త జరిమానాల వివరాల ప్రకారం… అడవిలో చెత్త, ప్లాస్టిక్‌ వేస్తే రూ.1000, ధూమపానం, మద్యం తాగితే రూ.1000, కోతులకు ఆహారం వేస్తే రూ.1000 , అకారణంగా వాహనాలు నిలిపితే రూ.500 , 30 కిలోమీటర్లకు మించి వేగంగా వాహనం నడిపితే రూ.500 జరిమానాలు విధించనున్నారు.

నల్లమల అడవితో పాటు అందులో ఆవాసం ఉంటున్న వన్యప్రాణుల సంరక్షణ కోసమే ఈ నిబంధనలు అమలుచేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. దారిలో కోతులకు ఆహారం వేయడంతో వాటి కోసం వస్తున్న కోతులు అనేక సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలకు గురికావడమే కాకుండా అటువంటి ఆహారాన్ని తిని ఇన్ఫెక్షన్లకు గురవుతున్నాయని చెబుతున్నారు. ఎక్కడబడితే అక్కడ ప్లాస్టిక్‌, చెత్తను వేయడంతో అలాంటి వ్యర్థాలను వన్యప్రాణులు తిని మృత్యువాడ పడుతున్నట్లు గుర్తించామంటున్నారు. దీనిపై ఆత్మకూరు అటవీ డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అలెన్‌చాన్‌ టెరాన్‌ను వివరణ కోరగా.. ‘జాతీయ పులుల సంరక్షణ అథారిటీ నిబంధనల మేరకు జరిమానాలు విధిస్తున్నాం. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసమే ఈ చర్యలు. జరిమానాల సొమ్మును పులుల సంరక్షణ అథారిటీకి జమ చేస్తాం’ అని వివరించారు.