Rs. 1400 crore scam allegations on Delhi LG Saxena
mictv telugu

రూ. 1400 కోట్ల రద్దయిన నోట్ల స్కాం.. ఎల్జీపై ఆప్ సంచలన ఆరోపణ

August 29, 2022

ఢిల్లీ రాజకీయాలు వారానికో మలుపు తిరుగుతుంది. ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అవకతవకల్లో ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఉన్నారని ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇదే కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆప్ పార్టీ ప్రతీకార ఆరోపణలకు దిగింది. 2016లో వీకే సక్సేనా కేవీఐసీ చైర్మెన్‌గా ఉన్నప్పుడు రూ. 1400 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ సోమవారం అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సక్సేనా చైర్మెన్‌గా ఉన్నప్పుడు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడింది. దాంతో నోట్ల మార్పిడికి సక్సేనా బ్యాంకు క్యాషియర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత ఆ క్యాషియర్ సస్పెండ్ కావడం దురదృష్టకరం. దీనికి సంబంధించి ఓ న్యూస్ రిపోర్టు కూడా ఉంది. బాధిత ఉద్యోగుల ప్రకటనలు కూడా ఉన్నాయి. ఒక్క ఢిల్లీ బ్రాంచిలోనే రూ. 22 లక్షలు మార్పిడి జరిగింది. దేశవ్యాప్తంగా 7 వేల బ్రాంచులలో చూస్తే సుమారు రూ. 1400 కోట్ల కుంభకోణం జరిగింది’ అని తెలిపారు. దీంతో ఆప్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకొని పోడియం వైపు దూసుకొచ్చారు. ఎల్జీ రాజీనామా చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక, ఈడీ, సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరారు. సక్సేనా చోర్ హై, సక్సేనా కో అరెస్ట్ కరో అంటూ గాంధీ విగ్రహం ముందు ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.