తిరుమలలో వరుస వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే శ్రీవారి ఆలయంపై డ్రోన్ సంచరించిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తాజాగా తిరుమల లడ్డూ కౌంటర్లో దొంగతనం జరిగింది. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కౌంటర్ నెంబర్ 36 వద్ద ఈ ఘటన జరిగింది. కౌంటర్ బాయ్ నిద్ర మత్తులో వుండగా దొంగ లోపలికి చొరబడి రూ.2 లక్షలు చోరి చేసినట్లు టీటీడీ గుర్తించింది. దీనిపై తిరుపతి వన్‌టౌన్ పోలీసులకు టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తిస్తున్నారు. ఇతను గతంలోనూ పలు చోరీలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల లడ్డూ అంటే భక్తులకు ఎంతో ఇష్టం. తిరుమల వెళ్ళి వచ్చాక లడ్డూ ప్రసాదాల గురించి అంతా వాకబు చేస్తారు. అందునా అక్కడికి వెళ్లిన వారు తిరుమల లడ్డూలు ఎక్కువగా కొనుగోలు చేసి తీసుకువస్తారు. అలాంటి ప్రసాదం కౌంటర్లో చోరీ జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉండగా .. ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లను నిన్న ఆన్ లైన్ లో విడుదల చేసింది. క్షణాల్లోనే టోకెన్లు అమ్ముడయిపోయాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేసింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు టిక్కెట్ల జారీ నిలిపివేసింది.