రేపటి నుంచే కొత్త రూ. 200 నోటు - MicTv.in - Telugu News
mictv telugu

రేపటి నుంచే కొత్త రూ. 200 నోటు

August 24, 2017

రూ. 200 నోటును శుక్రవారం ప్రవేశపెడతామని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది నవంబర్ 8 పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం తీసుకొస్తున్న మూడో కొత్త నోటు ఇది. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసి కొత్త రూ. 500, రూ. 2000 నోట్లను చలామణిలోకి తీసుకురావడం తెలిసిందే.

రూ. 200 నోటును ప్రవేశపెట్టడం దేశంలో ఇదే తొలిసారి. ప్రభుత్వం ఈ నోటు నమూనాను ముందుగానే విడుదల చేసింది. ఈ నోటు పసుపు, నారింజ రంగుల్లో ఉంది. నోటు వెనుక భాగంలో ప్రాచీన బౌద్ధ సాంచీ స్తూపం చిత్రాన్ని ముద్రించారు. నల్లధనం, అవినీతికి కళ్లెం వేయడానికి ఈ నోట్లు ఉపయోగ పడతాయని భావిస్తున్నారు. రూ.100, రూ.500 మధ్య ఆ నోట్లు తప్ప మరో నోటు లేదు. దీంతో చిల్లర సమస్యలు తలెత్తుతున్నాయి. రూ. 2000 నోటుకు చిల్లర దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రూ. 200 నోటు రాకతో కాస్త ఊరట లభించనుంది. మరోపక్క.. చిల్లర నోట్లు పెరగడంతో రూ. 2000 నోటును ప్రభుత్వం రద్దు చేస్తుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.