శివసేన అధికార పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఏక్‌నాథ్ షిండే పార్టీకే చెందుతాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. షిండే వర్గానికే మెజారిటీ ఉండడంతో వారికి కేటాయిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దీనిపై థాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన అధికార పార్టీ పేరు, విల్లుబాణం గుర్తును ఏక్‌నాథ్ షిండే దక్కించుకోవడం వెనుక భారీ డీల్ జరిగిందని ఆరోపించారు. సుమారు రూ .2000 కోట్ల వరకు ఒప్పందం జరిగిందన్నారు. అంతకు మించి ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సంజయ్ రౌత్ వెల్లడించారు. రూ .2000 కోట్ల డీల్‌పై పూర్తిస్థాయి సమాచారం ఉందని తెలిపారు. దీనిపై త్వరలో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి డీల్ మొదటిది అని చెప్పారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపపై షిండే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
గత ఏడాది జులైలో కొందరు పార్టీ ఎంఎల్‌ఎలతో ఏక్‌నాథ్ షిండే పార్ట్టీనుంచి బయిటికి వచ్చారు. మహా వికాస్ అఘాడి(శివపేన, కాంగ్రెస్, ఎన్‌సిపి, ఇతరులు)ని ఆయన వ్యతిరేకించారు. ఆ తర్వాత బిజెపితో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో థాక్రే వర్గం, షిండే వర్గం సిసలైన శివసేన గుర్తింపు కోసం న్యాయ పోరాటానికి దిగగా..తాజాగా బాణం గుర్తును ఏక్‌నాథ్ షిండే పార్టీకే ఈసీ కేటాయించింది.