ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా జంగమహేశ్వరపాడులో శుక్రవారం ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయాలపాలైన టీడీపీ కార్యకర్త జల్లయ్య చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు వైసీపీ ప్రభుత్వమే ప్రధాన కారణమని, జల్లయ్యపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ తరఫున జల్లయ్య కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
అనంతరం ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..”కార్యకర్త జల్లయ్య మృతదేహాం ఆస్పత్రి నుంచి ఎక్కడికి తరలించారో చెప్పండి. సొంత గ్రామంలో దహన సంస్కారం చేసే అవకాశం కూడా ఇవ్వరా?. ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారు. హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హస్తం ఉంది. ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలి” అని ఆయన అన్నారు.
మరోపక్క జల్లయ్య మృతి చెందాడని విషయం తెలుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరుతుండగా పోలీసులు వారిని ఎక్కడికక్కడే గృహ నిర్బంధం చేశారు. జల్లయ్య అంతిమ యాత్రలో దాడులు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జల్లయ్య కుటుంబానికి టీడీపీ ఎప్పుడు అండగా నిలుస్తోందని, టీడీపీ పార్టీ తరుపున జల్లయ్య కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తున్నామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు.