బతుకమ్మ పండగ వచ్చిందంటే తెలంగాణ ఆడబిడ్డలకు ఇప్పుడు కొత్త చీరల కానుకలే. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే పోయినసారి ఇచ్చిన చీరలు నాసిరకంగా వున్నాయని విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి విమర్శలకు తావులేకుండా తెలంగాణ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుందని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ఇవాళ (సెప్టెంబర్-27) బతుకమ్మ చీరల డిస్ప్లే ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘గత సంవత్సరం జరిగిన పొరపాటు ఈ సంవత్సరం జరగకూడదని ఈసారి బతుకమ్మ చీరల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది ప్రభుత్వం. 80 రకాల కలర్స్‌తో..రూ.280 కోట్లతో చీరలను తయారీ చేయించాం. ఈసారి 95 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నాం. అక్టోబర్ -12 నుంచి పంపిణీ చేయబోతున్నాం. మన సిరసిల్లలోనే ఈ చీరలన్నీ, మన నేతన్నల చేతుల మీదుగానే, 20వేల మరమగ్గాలపై తయారు చేయించాం. ఈ కార్యక్రమంతో నేతన్నలకు చేతినిండా పని దొరికింది.
మహిళలకు కానుకా..నేతన్నలకు ఉపాధి దొరుకుతుందనే ఆలోచనతో ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. గతేడాది సమయం లేకపోవడంతో.. సూరత్ నుంచి వచ్చిన చీరలు నాసిరకంగా ఉన్నాయనే ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ..ఈసారి సిరిసిల్లలోనే తయారు చేయించాం’ అని వెల్లడించారు కేటీఆర్. ఈసారి బతుకమ్మ చీరలను ఆడబిడ్డలు హాట్ కేకుల్లా అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్కో చీరకు రూ.290 ఖర్చు అయిందన్నారు. పంపిణీ కోసం ఇప్పటికే చీరలు వివిధ జిల్లాలకు చేరాయని అన్నారు. ఈసారి ఈ కార్యక్రమం చాలా పెద్ద సక్సెస్ అవుతుందని అభిప్రాయపడ్డారు.