‘ధన మూలం ఇదమ్ జగత్’ అనే నానుడిని బాగా ఒంటపట్టించుకున్నారో ఏమో.. గానీ వారంతా అత్యాశకు పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకున్నారు. ఆర్థిక నేరగాళ్లు ఎక్కువయ్యారని ప్రభుత్వం, పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా.. వాటిని ఏమాత్రం ఖాతరు చేయక, ఇప్పుడు కోట్ల సంఖ్యలో పెట్టుబడి పెట్టి, తీరా మోసపోయామని గ్రహించి.. పోలీసులే దిక్కంటూ స్టేషన్ల ముందు బారులు తీరారు. రూ.లక్ష పెట్టుబడి పెడితే రెండింతల డబ్బు తిరిగి చెల్లిస్తామని ఆ చీటింగ్ కంపెనీ చెప్పిన మాయమాటలు విని అడ్డంగా బుక్కయ్యారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘారానా మోసం వెలుగుచూసింది.
పాకిస్థాన్‌కు చెందిన కేపీడబ్ల్యూ క్రిప్టో కంపెనీ పేరిట రూ.35 కోట్ల మేర వసూళ్లు చేసి జనానికి టోకరా వేశారు. జిల్లాలోని యాచారం మండల కేంద్రానికి చెందిన సుఫియాన్, అతడి సోదరులు పెట్టుబడుల పేరుతో ఈ డబ్బులు వసూలు చేశారు. లక్ష రూపాయలకు నెలకు 9 వేలు వడ్డీ ఇస్తామని ఆశ చూపారు. ఇలా వందల మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. తొలుత కొందరికి నెలవారీ వడ్డీ చెల్లించడంతో మిగిలిన వారు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇలా నిందితులు రూ.35 కోట్లకు పైగా వసూలు చేశారని అంచనా. అయితే, ఇటీవల చెల్లింపులు నిలిచిపోవడంతో కొందరు వారిని సంప్రదించగా.. మీకు దిక్కున్నచోట చెప్పుకోండని, ఎక్కువగా మాట్లాడితే చంపుతామని బెదిరించారు.
దీంతో దిక్కు తోచని బాధితులు పోలీసులకు మూడ్రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దాదాపు 50 మందికి పైగా బాధితులు తాము ఆన్‌లైన్‌లో చెల్లించిన డిపాజిట్ పత్రాలను సీఐ లింగయ్యకు చూపించారు. ఒక్క యాచారం మండలంలోనే రూ.10 కోట్లకు పైగా డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. పిల్లల పెళ్లిళ్లకు అవసరం వస్తాయనే ఆశతో రూ.లక్షలు జమ చేశామని, మీరు ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈ కంపెనీలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు సమాచారం.