అర్జున్ రెడ్డి.. 50 రోజులు.. 51 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

అర్జున్ రెడ్డి.. 50 రోజులు.. 51 కోట్లు

October 16, 2017

తెలుగు రాష్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల్లో, అమెరికాలోనూ సంచలనం సృష్టించిన టాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ బాక్సాఫీస్ వసూళ్లు రూ. 51 కోట్లకు చేరుకున్నాయి. ఈ మూవీ విడుదలై 50 రోజులు దాటింది. అయినా యవతలో అర్జున్ రెడ్డి మానియా తగ్గకపోగా విపరీతంగా పెరిగిపోతోంది.  రూ. 4 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ.. అటు హీరో విజయ్ దేవరకొండకు, ఇటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను రాత్రికి రాత్రి తారాపథానికి తీసుకెళ్లింది.

సినీవ్యాపార విశ్లేషకుల ప్రకారం.. ఆంధ్రా, నైజాంలలో ఈ మూవీకి రూ. 32.3 కోట్లు వసూళ్లయ్యాయి. ఇందులో డిస్ట్రిబ్యూటర్ల వాటా రూ. 17 కోట్లపైనే. అమెరికాలో రూ. 11.6 కోట్లు వసూలు కాగా, అందులో డిస్ట్రిబ్యూటర్ వాటా రూ. 5.8 కోట్లు. ఇక కర్ణాటకలో రూ. 3.8 కోట్లు వసూలయ్యాయి. ఇందులో డిస్ట్రిబ్యూటర్ వాటా రూ. 1.35 కోట్లు.  హక్కుల విక్రయం వగైరా అన్నీ కలిపి మొత్తం వసూళ్లు రూ. 51 కోట్లు కాగా, అందులో డిస్ట్రిబ్యూటర్ల వాటా రూ. 26 కోట్లు. ఈ ఏడాది హిట్ మూవీస్ లో ఒకటిగానే కాకుండా టాలీవుడ్‌లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన అర్జున్ రెడ్డి హవా ఈ ఏడాది చివరి వరకు కొనసాగనుంది. ఆ లోపు వసూళ్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ మూవీని తమిళం, కన్నడం, హిందీ, మలయాళ భాషల్లో రీమేక్ చేయడానికి యత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మూవీ హిట్ కావడంతో సందీప్, విజయ్ దేవరకొండలకు భారీ ఆఫర్లు వస్తున్నాయి.