అపోలోకు నోటీసులు.. కరోనా టెస్టుకు ఎక్కువ ఛార్జ్ చేసిందని.. - MicTv.in - Telugu News
mictv telugu

అపోలోకు నోటీసులు.. కరోనా టెస్టుకు ఎక్కువ ఛార్జ్ చేసిందని..

July 6, 2020

Rs 6000 for COVID tests Are Bengaluru's top private hospitals guilty of overchargin

పీనుగుల మీద పేలాలు ఏరుకున్నట్టే చేస్తున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు. వీటి లాలూచీ గురించి తెలిసిన ప్రభుత్వాలు ముందుగానే కరోనా పరీక్షల చార్జీలను ప్రకటించాయి. అయినా వాటి దోపిడీ ఆగడంలేదు. కరోనాతో సంపాదన లేక మలమలలాడుతున్నవారి జేబులను లూటీ చేయడానికి గుంట కాడి నక్కల్లా కాచుకుని కూర్చున్నాయి. ఈ క్రమంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షకు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు  చేసినందుకు అపోలో ఆసుపత్రికి కర్ణాటక ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. బెంగళూరులోని శేషాద్రిపురంలో ఉన్న అపోలో హాస్పిటల్ ఐసీఎంఆర్ మార్గదర్శకాలను ఉల్లంఘించింది. కరోనా పరీక్షకు రూ.6వేలు ఛార్జ్ చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం నోటీసులో పేర్కొంది. 

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.4,500లకు మించి ఛార్జ్ చేయకూడదు. అయితే సదరు ఆసుపత్రి అవేవీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా అపోలో డైరెక్టర్‌ను కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. అపోలో అడ్మనిస్ట్రేషన్ టీం ఈ ఘటనపై స్పందించింది. తాము రిఫండ్ ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టామని.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రేట్లను కూడా మార్చినట్లు తెలిపింది. తమ ఆసుపత్రి ఎప్పుడూ ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే వైద్యసేవలు అందిస్తుందని.. ఇకపై కూడా అందుకు కట్టుబడే ఉంటుందని వివరణ ఇచ్చింది.