రూ.70 కోట్ల అక్రమాస్తులు.. మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.70 కోట్ల అక్రమాస్తులు.. మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డి అరెస్ట్

September 23, 2020

Rs 70 crore smuggler identified .. Malkajgiri ACP Narsinghareddy arrested0.

ఆదాయానికి మించిన ఆస్తులు ఉండటంతో మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు రూ.70 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల వివరాలను సేకరించారు. ఈ కేసులో ఎట్టకేలకు ఏసీపీ నర్సింహారెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఈరోజు ఉదయం నుంచి 25 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. వరంగల్‌లో మూడు చోట్ల, కరీంనగర్, నల్గొండలో రెండు చోట్ల, హైదరాబాద్‌లోని మహేంద్రహిల్స్, డీడీ కాలనీ, అంబర్‌పేట, ఉప్పల్, హఫీజ్ పేట్‌లలో ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. అ క్రమంలో అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి,  హఫీజ్‌‌పేట్‌‌లో మూడంతస్తుల కమర్షియల్‌ బిల్డింగ్‌ సహా రెండు ఇండిపెండెంట్ ఇళ్లు, సైబర్‌ టవర్స్‌ ఎదురుగా 1,960 గజాల భూమి, మరో 4 ప్లాట్లను గుర్తించారు. రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా రెండు బ్యాంక్‌ లాకర్లని కూడా గుర్తించారు. లాకర్లు ఓపెన్‌ చేస్తే ఏసీపీ అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ మరియు ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ పత్రాలను స్వాధీనం చేసుకుంది. కాగా, భూముల సెటిల్‌మెంట్లు, ఇతర వ్యవహారాల ద్వారా ఇదంతా సంపాధించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఏసీపీగా ఉన్న నరసింహరెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పనిచేశారు. ఆ సమయంలో భూ తగాదాల్లో కల్పించుకుని సెటిల్‌మెంట్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.