షాక్.. 300 చెట్లు నరికినందుకు రూ.9 లక్షల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

షాక్.. 300 చెట్లు నరికినందుకు రూ.9 లక్షల జరిమానా

June 3, 2020

300 Kher Trees

300 చెట్లు నరికివేశాడని ఓ కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. అనుమతించిన దానికంటే ఎక్కువ చెట్లను నరికివేశాడన్న కారణంగా అతనికి పంజాబ్‌ ప్రభుత్వం రూ.9 లక్షల భారీ జరిమానా విధించింది. మొహాలీలోని మీర్జాపూర్ అడవిలో సిల్వికల్చర్‌ (కలప ఉత్పత్తికై చెట్ల పెరుగుదల నియంత్రణ)లో భాగంగా దాదాపు 6 వేల ఖేర్‌ చెట్లను నరికేందుకు  అటవీ శాఖ అనుమతి ఇచ్చింది. చెట్ల నరికివేత కాంట్రాక్టును కపిల్‌ శర్మ అనే కాంట్రాక్టర్‌ తీసుకున్నాడు. అయితే అతడు నిబంధనలు ఉల్లంఘించి మరో 300 చెట్లను అధికంగా నరికాడు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పంజాబ్‌ విజిలెన్స్‌ బ్యూరో అధికారులు విచారణ చేపట్టి, 300 చెట్లను నరికినట్టు తేల్చారు. ఈ క్రమంలో అతనికి రూ.9 లక్షల జరిమానా విధించారు. అతడు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద జమ చేసిన డబ్బులో నుంచి ఇప్పటికే రూ. 5.72 లక్షలను కట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. 

మొత్తంగా రూ. 9లక్షల జరిమానా విధించిన నేపథ్యంలో అతడి నుంచి మరో మూడున్నర లక్షలు త్వరలోనే వసూలు చేయనున్నట్లు చెప్పారు.  ఈ విషయంపై కాంట్రాక్టర్ కపిల్‌ శర్మ మాట్లాడుతూ.. ‘జరిమానా గురించి తనకేమీ సమాచారం లేదు. కార్మికులు పొరబాటున ఈ తప్పు చేసి ఉంటారు. నేను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదు’ అని వాపోయాడు.  కాగా, రెండు అడుగుల కంటే ఎక్కువ వ్యాసం కలిగి ఉన్న చెట్లను మాత్రమే నరికివేసే ప్రక్రియలో భాగంగా కపిల్‌ శర్మకు ఈ అవకాశం వచ్చింది. ఈ ప్రక్రియ ప్రతీ ఐదేళ్లకు ఒకసారి చేపడతారు. మార్చి 31 నాటికి కలపను తీసుకు వెళ్లాలని అధికారులు అతడికి సూచించినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ విధించాక కూడా ఈ చెట్ల నరికివేత కొనసాగినట్లు సమాచారం.