బాలాపూర్ గణేశ్ నిమజ్జనానికి ఆరెస్సెస్ చీఫ్
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 12న జరిగే నిమజ్జన కార్యక్రమానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరుకానున్నారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే బాలాపూర్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. బాలాపూర్ నుంచి ఊరేగింపు ప్రారంభం అయిన తర్వాత ఎంజే మార్కెట్ వద్దకు చేరుకోగానే భగవత్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని భాగ్యనరగ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు తెలిపారు.
3 నుంచి 4 గంటల సమయంలో ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. దీనికి ఆరెస్సెస్ చీఫ్‌తో పాటు ప్రజ్ఞా మిషన్ వ్యవస్థాపకుడు స్వామి ప్రజ్ఞా నానాజీ కూడా రానున్నట్టు తెలిపారు. కాగా వినాయకుడి ఊరేగింపు శాలిబండ, చార్మినార్, ఎంజే మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్ వరకు సాగుతుందని చెప్పారు. భగవత్ రాకకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు.